hiking
-
పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..
యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు. నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. (చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్) -
ఫెడ్.. ‘‘వడ్డించెన్!
► వడ్డీ రేటు పావు శాతం పెంపు ► ప్రస్తుత 0.25 శాతం నుంచి 0.5 శాతానికి... ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే భవిష్యత్తులో ► క్రమంగా పెంచుతామని ప్రకటన న్యూయార్క్: అంతా ఊహించినట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. అమెరికాలో ప్రస్తుతం 0-0.25 శాతం శ్రేణిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. 2016లో మరో రెండు నుంచి నాలుగు దఫాలు రేట్ల పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడ్ కూడా దీన్ని ధృవీకరిస్తూ.. భవిష్యత్‌లో క్రమేపీ రేట్ల పెంపు మరింత ఉండవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనికి తగ్గట్లే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితులు, గణాంకాలపై రేట్ల పెంపు ఆధారపడి ఉంటుందని తెలిపింది. రివర్స్ రెపో రేటును పావు శాతంగా ఉంచుతున్నట్లు ఫెడ్ తెలిపింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరగగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఫెడ్ సభ్యులు రేట్ల పెంపును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఫెడ్ ఫండ్స్ రేటు అంటే.. మన రిజర్వ్ బ్యాంక్ రెపో, రివర్స్ రెపో రేట్లకు, ఫెడ్ ఫండ్స్ రేటుకు వ్యత్యాసం వుంది. రిజర్వ్ బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకులకు రుణాలివ్వడానికి, బ్యాంకులతో తన వద్ద డిపాజిట్ చేయించడం కోసం రెపో సాధ నాన్ని ఆర్బీఐ వాడుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఫెడ్ ఫండ్స్ రేటు అనే సాధనాన్ని ఉపయోగిస్తుంది. ఏడాదికి 8 దఫాలు జరిగే ఫెడ్ మార్కెట్ కమిటీ సమీక్షల్లో ఈ రేటు ఎంత వుండాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ వుంటారు. కానీ ఈ రేటుకు ఫెడ్ స్వయంగా అప్పులివ్వదు. అందుకే దీనిని ఫెడ్ ఫండ్స్ టార్గెట్ రేటుగా పేర్కొంటుంటారు. బ్యాంకులు, ద్రవ్య సంస్థలు వాటి నిర్దేశిత రిజర్వులకంటే మించి వున్న లేదా తగ్గిన స్వల్పకాలిక నిధుల్ని ఫెడ్ వద్ద వుంచుతాయి. వాటిని ఆయా బ్యాంకులు ఇచ్చి, పుచ్చుకునే వడ్డీ రేటును ఫెడ్ ఫండ్స్ ఎఫెక్టివ్ రేటుగా వ్యవహరిస్తారు. ఇది టార్గెట్ రేటుతో దాదాపు సమానంగా వుంటుంది. అయితే ఫెడ్ వద్ద ఇతర బ్యాంకుల నిల్వలు అవసరార్థం లేకపోతే ఫెడ్ స్వయంగా ఫెడ్ డిస్కౌంట్ రేటుపై రుణాలిస్తుంది. కానీ ఇది ఎఫెక్టివ్ రేటుకంటే అధికంగా వుంటుంది. రేట్లు పెంచడం ద్వారా అధిక వడ్డీ రేటుకు నిధుల్ని తీసుకునే బ్యాంకుల్ని నిరుత్సాహపర్చడానికి, రేటు తగ్గించడం ద్వారా కనిష్ట రేటుకు నిధుల్ని బ్యాంకులు తీసుకుని వ్యవస్థలో దారాళంగా రుణ సరఫరా చేయడానికి ఈ ఫెడ్ పండ్స్ రేటు సాధనాన్ని ఫెడరల్ రిజర్వ్ ఉపయోగిస్తుంది. మనపై ప్రభావం ఏంటి? మొత్తానికి అంతా అనుకున్నట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలకమైన వడ్డీ రేట్లను పెంచింది. మరి దీని ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతోంది? మార్కెట్లు ఎలా స్పందించవచ్చు? కంపెనీలపై ప్రభావం ఏమిటి? రూపాయి ఏం కావొచ్చు? ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం. దేశీ కంపెనీలపై .. అంతర్జాతీయంగా డాలర్ లిక్విడిటీ తగ్గిపోవడం వల్ల .. విదేశీ రుణాలు తీసుకున్న కార్పొరేట్లపై చెల్లింపులపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. దీంతో ఆయా కంపెనీలకు మార్కెట్లలో కష్టకాలం ఎదురుకావొచ్చు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, వేదాంత, అదాని పవర్, రిలయన్స్ పవర్ తదితర కంపెనీలకు డాలర్ల రూపంలో తీసుకున్న రుణం భారీగా వుంది. రూపాయిపై .. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇప్పటికే గణనీయంగా పడిపోయింది. ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకుపోయే పక్షంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే కరెంటు అకౌంటు లోటుపై ఒత్తిడి పెరగొచ్చని వారి అభిప్రాయం. భారత్, అమెరికా బాండ్లపై వడ్డీ రేట్ల మధ్య గణనీయంగా వ్యత్యాసమున్నప్పటికీ.. ఇటీవల దేశీయంగా ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూ వస్తున్నందున... ఈ వ్యత్యాసమూ తగ్గుతోంది. తాజాగా అమెరికాలో రేట్లు పెంచడం వల్ల అక్కడి బాండ్లు.. విదేశీ ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారగలవు. దీంతో వారు అమెరికా బాండ్లలో పెట్టేందుకు.. ఇప్పటిదాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన నిధులను వెనక్కి తీసుకెళ్లిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు.. ఇంధన అవసరాల కోసం భారత్ సుమారు 80% ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. రూపాయి క్షీణిస్తే ఇంధనం ధరలు పెరుగుతాయి. ఫలి తంగా ద్రవ్యోల్బణమూ పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, రూపాయి మారకం విలువను స్థిరపర్చడం లక్ష్యాలతో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించడానికి ఇష్టపడకపోవచ్చు. పసిడి పడేనా..పెరిగేనా? వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం దరిమిలా పసిడి రేటు తగ్గొచ్చని కొన్ని వర్గాలు, పెరగొచ్చని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా డాలరు కదలికలకు వ్యతిరేక దిశలో పుత్తడి రేట్లు ఉంటాయని, డాలరు మరింత పటిష్టం కావొచ్చు గనుక పసిడి ధర ఇంకా పడొచ్చని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంటు చేసుకున్న పక్షంలో ఫెడ్ తదుపరి మళ్లీ ఎప్పుడు పెంచవచ్చన్న సంకేతాల కోసం ట్రేడర్లు వెతుక్కుంటారని, ఆ రకంగా చూసినా బంగారం ధరలు తగ్గేట్లే కనిపిస్తున్నాయని ఒక వర్గం చెబుతోంది. అయితే, ఇప్పటికే రేట్ల పెంపు అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు భారీగా సర్దుకున్నాయని, దీంతో డాలరు తగ్గి, పసిడి మరింత పెరగొచ్చని తెలిపింది. స్టాక్ మార్కెట్లపై.. గడచిన ఆరు నెలల్లో సెన్సెక్స్ సుమారు 11% తగ్గింది. 4 నెలల పాటు ఎఫ్ఐఐలు నికరంగా అమ్ముతూనే ఉన్నారు. వడ్డీ రేట్లు పెంపుతో గ్లోబల్ ఫండ్స్ భారత్ సహా వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించవచ్చు. అయితే, భారత ఎకానమీ రికవరీ బాటలో ఉండటం, స్థూల దేశీయోత్పత్తి మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లు మరీ భారీగా స్పందించకపోవచ్చని పరిశీలకుల అంచనా. -
పేదల కోసమే ‘ఎన్టీఆర్ భరోసా’
పండుగలను సంతోషంగా జరుపుకోవాలి ప్రతి కాగితానికీ పరిష్కారం జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో : ‘ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్రలో ఎముకల గూడుతో కనిపించిన ఎంతో మంది నిరుపేద వృద్ధులను కలిశాను. వారిని చూసి నా మనసు చలించిపోయింది. ఆనాడే పింఛన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నా. జ్వరమొస్తే మందు బిళ్లలు కొనలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు రూ.200 పింఛను ఏం సరిపోతుంది? అందుకే దాన్ని రూ.1000 చేశా. అదే విధంగా వికలాంగుల పింఛనును రూ.500 నుంచి రూ.1500 చేశా. ఒక్కొక్కరికీ ఐదు రెట్లు పెంచి పింఛన్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరే ‘ఎన్టీఆర్ భరోసా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మహాత్ముని సాక్షిగా పెంచిన పింఛన్లను గురువారం నుంచి పంపిణీ ప్రారంభించామని ఆయన చెప్పారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం మైదానంలో గురువారం మధ్యాహ్నం ‘జన్మభూమి- మా వూరు’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి చంద్రబాబు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దసరా, దీపావళి పండగలను సంతోషంగా జరుపుకుంటారన్న ముందస్తు ఆలోచనతోనే అక్టోబరు 2 నుంచి భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించామన్నారు. అయితే అనర్హులకు మాత్రం పింఛన్లు ఇవ్వలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మగవారికి కూడా వితంతు పింఛన్లు పంపిణీ చేశారంటే ఎంత ఘోరమో ఆలోచించాలన్నారు. ప్రజలిచ్చిన ప్రతి కాగితానికీ రాబోయే రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. వాహనాలన్నింటికీ సీఎన్జీ... విజయవాడలోని వాహనాలన్నింటికీ సీఎన్జీ (గ్యాస్) అందించే దిశగా ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని వాహనాలకూ సీఎన్జీ అందించి కాలుష్య నివారణకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఆఫ్టిక్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా మహిళలు వంటలు నేర్చుకోవడం నుంచి విద్యార్థులు పాఠాలు, వృత్తి పని వారు వృత్తిలో మెళకువలు నేర్చుకునే ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ ఆదా చేయడం కోసం రూ 10కే ఎల్ఈడీ బల్పులు అందించే పథకం ప్రారంభించామనీ, పేదలకు ప్రభుత్వం ఈ బల్పులు అందిస్తుందనీ, డబ్బున్న వారు వారే కొనుక్కోవాలని కోరారు. ఈ బల్పులు వాడటం వల్ల విద్యుత్ వినియోగం బాగా తగ్గి రాష్ట్రంలో విద్యుత్ ఆదా అవుతుందని ఆయన చెప్పారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ... సీఎం చంద్రబాబు సుధీర్ఘ ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగం ముగిశాక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు పంపి ణీ చేసే క్రమంలో వారిని పేరుపేరునా పలకరించడం, ఏం చేస్తుంటారో తెల్సుకోవడం, పెరిగిన పింఛను తీసుకోవడంలో ఎలా ఫీలవుతున్నారని వారిని ప్రశ్నిస్తూ ఒక దశలో టీవీ రిపోర్టర్ మాదిరిగా మారిపోయారు. వారు చెప్పినవనీ విన్న తర్వాత వారి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరించి, ఇలాంటి వారికోసమే తాను పనిచేస్తుందని చె ప్పుకున్నారు.. కార్యక్రమం కోసం లక్షలరూపాయలు ఖర్చు చేసిన నిర్వాహకులు ఎక్కడ కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో అటు వేదికపై అతిథులు, ఇటు అధికారులు, మీడియా, మహిళలందరూ కార్యక్రమం ముగిసే వరకూ పేపర్లతో విసురుకుంటూనే గడిపారు. ప్రసంగించినంత సేపూ చంద్రబాబు కూడా కర్ఛీఫ్తో తుడుచుకుంటూనే ఉన్నారు. మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, సుజనాచౌదరి, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, గద్దె రామ్మెహన్, బోడే ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు.