పోస్టల్ బ్యాలెట్లపై నిఘా : కలెక్టర్
- దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు
- ఓటర్ స్లిప్పు ఉంటే గుర్తింపు కార్డు అక్కర్లేదు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులకు హాజరవుతూ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేయటం చట్టరీత్యా నేరమన్నారు.
పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం చేస్తూ పట్టుబడితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదముందన్నారు. అటువంటివారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పారు. జిల్లాలో 25 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎన్నికల సిబ్బంది ఆయా తేదీల్లో వచ్చి లోక్‌సభ, అసెంబ్లీ బ్యాలెట్లు తీసుకుని ఓటుహక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఆ రెండు రోజుల్లో దరఖాస్తులు సమర్పించి, బ్యాలెట్లు తీసుకుని వెంటనే ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫెసిలిటేట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నేటినుంచి స్లిప్పుల పంపిణీ...
ఆదివారం నుంచి జిల్లాలో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. 28, 29 నాటికి స్లిప్పులు మొత్తం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్ స్లిప్పులు ఉంటే ఎటువంటి గుర్తింపు కార్డూ అవసరం లేదని ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఒకరి ఓటర్ స్లిప్పులు సంబంధంలేని వారి వద్ద ఉంటే ఎన్నికల నేరంగా పరిగణించి వారిపై కేసు పెడతామని చెప్పారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, జేసీ జె.మురళి పాల్గొన్నారు.