విజయవాడ, న్యూస్‌లైన్ : ఓటింగ్ శాతం పెంపుపై ఎన్నికల సిబ్బంది దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలకు చెందిన సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులదే కీలక బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. అలసత్వం, జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఓటు వేయడానికి ఆసక్తిగా లేని ప్రాంతాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ బాధ్యత సెక్టార్ అధికారులదే...
ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డుల్ని బాధ్యతలేని వ్యక్తులు, రాజకీయ పార్టీల ద్వారా జారీ చేయిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం 1951 నిబంధనలకు లోబడి కేసులు నమోదు చేస్తున్నట్లు విజయవాడ లోక్‌సభ సాధారణ పరిశీలకురాలు రేణుసంత్ హెచ్చరించారు. సెక్టార్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు. ఫొటో ఓటర్ స్లిప్పుల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు మంజూరు చేయాలన్నారు. సెంట్రల్ నియోజక వర్గ పరిశీలకులు పుష్యపాటి సక్సేనా పాల్గొన్నారు.
తిరువూరు, కైకలూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఉదయం.. మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, నూజివీడు, గుడివాడ, గన్నవరం నియోజక వర్గాల సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
ఓటింగ్ శాతం పెంచండి : కలెక్టర్
Published Fri, Apr 25 2014 1:23 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement