సంతానంపై ఈసీకి బలరాం తప్పుడు అఫిడవిట్‌ | Karanam Balaram Give Wrong Affidavit To Election Commission | Sakshi
Sakshi News home page

సంతానంపై ఈసీకి బలరాం తప్పుడు అఫిడవిట్‌

Published Wed, Jul 10 2019 4:32 AM | Last Updated on Wed, Jul 10 2019 4:33 AM

Karanam Balaram Give Wrong Affidavit To Election Commission - Sakshi

విజయవాడ సిటీ: పిల్లలు ఎంతమంది అనే విషయంలో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను డిమాండ్‌ చేశారు. బలరాంకు నాలుగో సంతానంగా అంబికకృష్ణ ఉండగా, తనకు ముగ్గురు బిడ్డలేనంటూ ఈసీకిచ్చిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ తాను ఈనెల 4న హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ వేసినట్టు తెలిపారు. ఆమంచి మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్‌ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బలరాం నాల్గవ సంతానానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.

అన్నప్రాసన నుంచి ప్రతి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెయింట్‌ థెరిసా హాస్పటల్‌లో అంబిక తండ్రిగా బలరాం పేరుతో ఇచ్చిన బర్త్‌ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఎంసెట్‌ హాల్‌టిక్కెట్, డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేయడానికిచ్చిన వినతిపత్రం, ఆధార్‌కార్డుసహా పలు పత్రాలను మీడియాకు చూపారు. బలరాం తన తండ్రి అని ఒక కుమార్తెగా తెలియజేసేందుకు ఇవి సరిపోతాయని, వీటిని కాదంటే.. డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నానని అంబిక చెప్పిందన్నారు. అతి పిన్నవయసులో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీ ఆంధ్ర, తెలంగాణకు అధికార ప్రతినిధిగా ఉన్న కాట్రగడ్డ ప్రసూనకు, బలరాంకు కుమార్తెగానేగాక ప్రఖ్యాత రాజకీయవేత్త ఎన్‌జీ రంగాకు దగ్గర బంధువుగా ఆమె అందరికీ తెలుసన్నారు. సామాన్య మహిళగా తన తల్లి, తండ్రి ఎవరనేది ఈ సమాజానికి తెలియజేయడానికి డాక్టర్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా తన మద్దతు కోరిందన్నారు.

తాను బలరాంపై పోటీ చేసి ఓటమి చెందాను కాబట్టి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన విధానంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆమంచి చెప్పారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన పత్రాలన్నింటిపై తనతోపాటు అంబిక సైతం సంతకాలు చేశారన్నారు. ఈ విషయమై బలరాం స్పందించడమేగాక చట్టానికి లోబడి రాజీనామా చేయాలని లేదా నైతికంగా సమాధానం చెప్పాలని ఆమంచి డిమాండ్‌ చేశారు. విలువల గురించి ఊదరగొట్టే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చిన విషయంపై స్పందించి బలరాంపై ఏం చర్యలు తీసుకుంటారో జవాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు అంబిక బాగా తెలుసన్నారు. ఆమె రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారన్నారు. జన్మనిచ్చిన కుమార్తెను తన కూతురు కాదనే క్రూరమైన మనస్తత్వమున్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటే చంద్రబాబు సైతం తప్పు చేసిన వారవుతారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement