పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వివరించారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఫామ్-6 దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ అధికారుల శిక్షణ, కమ్యూనికేషన్ ప్రణాళిక వంటి పలు అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, షామియానా,ప్రథమ చికిత్సా కేంద్రం తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల తాత్కాలిక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత డిసెంబర్ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలో 2,14,372 ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించామని, మిగిలిన 70, 958 దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ఇచ్చామన్నారు.
జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు చేరుకున్నారని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించి కమ్యూనికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
కొత్త ఓటర్ల నమోదుకు చేసుకున్న ఫామ్-6 దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలని సూచించారు. ప్రతి ఓటరు బూత్ స్థాయి అధికారి ద్వారా ఫొటో ఓటరు స్లిప్పులను నూరుశాతం పంపిణీ చేయాలని కోరారు. నామినేషన్ల దరఖాస్తులను అప్పటికప్పుడే పరిశీలించి వివరాలను సకాలంలో ఎన్నికల కమిషన్‌కు నివేదించాలన్నారు.
ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించే వారిపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు తదితర వివరాల నివేదికను అందజేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్ బీ. శ్రీనివాసులు, మచిలీపట్నంనుంచి ఎస్పీ జె. ప్రభాకరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ పి.మురళీధర్, ఆర్‌ఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.