గలగలపారే కృష్ణమ్మ. భూమికి పచ్చని రంగేసినట్లు గ్రీనరీ, సేదతీరేందుకు పార్కులు, నగరం నడిబొడ్డునే హుషారు నింపే బోటింగ్.. ఇవన్నీ ఊహించుకుంటేనే భలే థ్రిల్లింగ్‌గా ఉంది కదూ. వీటన్నింటినీ నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. కాలుష్య కాసారాలుగా మారిన కాల్వల్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.700 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. విదేశీ కన్సల్టెంట్లకు డిజైన్ల బాధ్యతను అప్పగించనుంది.
విజయవాడ సెంట్రల్ : కాల్వల్లో కాలుష్య భూతానికి చెక్‌పెట్టేందుకు నగరపాలక సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. దీనికి ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, సీఆర్‌డీఏ, పంచాయతీరాజ్ అధికారుల సహకారం కోరింది. ఈ మేరకు రెండు రోజుల కిందట కమిషనర్ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు కాల్వల్ని ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఇరిగేషన్ అధికారులను దీనిపై నివేదిక కోరారు. అది అందిన వెంటనే జపాన్ లేదా సింగపూర్ కన్సల్టెంట్లకు డిజైన్ బాధ్యతలను అప్పగించాలనే యోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాల్వల్ని ఆధునికీకరించి, అత్యాధునిక వసతులు సమకూర్చేందుకు సుమారు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాజధాని నిర్మాణం నేపథ్యంలో కాల్వల ఆధునికీకరణ అనివార్యమైంది. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఏడాదిన్నర క్రితమే కాల్వల్ని అందంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ అధికారులు భావించారు. నిధులలేమి కారణంగా ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్వల సుందరీకరణకు సంబంధించి నివేదిక కోరారు. సీఆర్‌డీఏ నుంచి నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
స్మార్ట్ రెవెన్యూ
రాజధాని విజయవాడకు కొత్త అందాలు అద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యటకుల్ని ఆకర్షించాలనే యోచనలో ఉంది. కాల్వల్ని ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దినట్లయితే దండిగా ఆదాయం సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు విదేశీ కన్సల్టెంట్లను రంగంలోకి దించుతున్నారు. బందరు, ఏలూరు, రైవస్ కాల్వలతోపాటు బుడమేరును ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాల్వల పరీవాహక ప్రాంతాలను సుందరీకరిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్కులు, ఫుడ్‌కోర్టులు, బోటింగ్‌ను ఏర్పాటుచేయనున్నారు. వీటితోపాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం రావచ్చని భావిస్తున్నారు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
రూ.700 కోట్లతో కాల్వలకు సొబగులు
Published Fri, Mar 4 2016 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM
Advertisement
Advertisement