ప్రజా సహకారంతో శాంతి భద్రతలు
విజయనగరం క్రైం: ప్రతి పోలీసూ ప్రజలతో సత్సం బంధాలు కలిగి ఉండాలి. అపుడే పోలీసులకు కచ్చితమైన సమాచారం వస్తుంది. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తాను, వైట్‌కాలర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని నూతన ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పోలీసుశాఖ మీడియాకు సమాచారం అందించడంలో విఫలమవుతోందని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా ఇకపై అటువంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు.
గత మూడు ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో రూ.50 లక్ష ల వరకూ దుర్విని యోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తానని, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపిస్తానని తెలిపారు. మావోయిస్టుల కదలికలపై తమ వద్ద పక్కా సమాచారం ఉందని, మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలపై కూడా దృష్టిసారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.సుందరరావు పాల్గొన్నారు.