
రుణాల మాఫీతో అభివృద్ధీ మాఫీయే
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
నేతలు పెద్ద హామీలిస్తే చాలా ఇబ్బందులొస్తాయి
చంద్రబాబు సంస్కరణలతో ఓసారి దెబ్బతిన్నారు.. సంస్కరణలు మానవీయ కోణంలో ఉండాలి
విజయవాడ బ్యూరో: ప్రభుత్వాలు రుణా లు మాఫీ చేస్తే అభివృద్ధి కూడా మాఫీ అయిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజలకు పెద్ద హామీలు ఇస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం విజయవాడలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలపై పారిశ్రామికవేత్తలు, మేధావులతో జరిగిన ముఖాముఖిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంస్కరణలను అమలు చేసి ఒకసారి దెబ్బతిన్నారని చెప్పారు. సంస్కరణలు మానవీయ కోణంలో ఉండాలని సూచించారు. తాను రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నానని, అన్నీ నిజాలే మాట్లాడతానని అన్నారు. స్మార్ట్ సిటీలుగా ఏ నగరాలను అభివృద్ధి చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. కానీ, విజయవాడ రాజ ధానిగా ఏర్పడే ప్రాంతం కాబట్టి దీనిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
సింగపూర్ కాదు.. మనకో మోడల్ ఉండాలి
రాష్ట్రాన్ని సింగపూర్ చేయాల్సిన అవసరం లేదని, మన మోడల్ మనకి ఉండాలని హితవు చెప్పారు. రాజధాని అయిన విజయవాడలో భూముల ధరలు న్యూయార్క్ నగర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వ్యాపారులు ప్రజలను అమాయకులను చేసి రేట్లు పెంచేస్తున్నారని, ఈ రేట్లు ఎంతో కాలం నిలబడవని అన్నారు. రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి, నూజివీడు మీదుగా రింగ్ రోడ్డు నిర్మించాలని సూచించారు. హైదరాబాద్ చంద్రబాబు హయాంలో అభివృద్ధి చెందిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కొంత అభివృద్ధి జరిగిందని చెప్పారు.
బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయండి
గుంటూరు: రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేసేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.