ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లనక్కర్లేదు!
హైదరాబాద్ సిటీ: ఎలాంటి ఇబ్బందులైనాసరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిమరీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా బాధితుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఎఫ్‌ఐఆర్ కియోస్క్ యంత్రాలు 'ఐ క్లిక్' లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. ఇప్పటికే విశాఖపట్నంలో మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. దాంతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఐ క్లిక్ యంత్రాలను నెలకొల్పారు.
మంగళవారం నెల్లూరులోని బృందావనం, ఆత్మకూరు బస్టాండుల్లో, బుధవారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సహా మరో చోట, గుంటూరులో రెండు చోట్ల ఏర్పాటు చేసిన 'ఐ క్లిక్' లను డీజీపీ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డీజీపీ శాంతిభద్రతలు, స్థానిక సమస్యలపై ఆయా జిల్లాల అధికారులతో సమీక్షించనున్నారు.