విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలకు కార్యాచరణ
♦ అధికారులతో సమీక్షలో టీటీడీ
♦ తిరుపతి జేఈవో పోలా భాస్కర్
తిరుపతి అర్బన్/తిరుమల: తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలను విదేశాల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ వెల్లడించారు. శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ విదేశాల్లో ఎప్పుడు స్వామివారి వైభవోత్సవాలను నిర్వహించినా వారాంతంలో రెండురోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వైభవోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే నమూనా ఆలయాల్లో శ్రీవారి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల విగ్రహాలను నూతనంగా తయారు చేయాలని చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డికి జేఈవో సూచించారు. నిర్ధేశిత విభాగాల నుంచి 30 మంది సిబ్బందికి మించకుండా విదేశీ యాత్రకు సిద్ధంగా ఉండాలన్నారు.
వెంకన్న దర్శనానికి 12 గంటలు
వేసవి సెలవులతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటరు మేర క్యూ ఉంది. వీరికి 12 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం కలగనుంది.