నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే ఆశావహులుతో నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సం దడి నెలకొంది. ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ రఫీఖ్ అహ్మద్ ఎదుట ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. నల్లగొండ పార్లమెంట్, నల్లగొండ, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలోని బ్లాక్, మండల స్థాయి నాయకుల నుంచి అహ్మద్ అభిప్రాయాలు సేకరించారు.
ఏఐసీసీ తరఫున జిల్లా ఇన్‌చార్జిగా వచ్చిన కుమార్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు తూడి దెవేందర్‌రెడ్డితో కలిసి వినతిపత్రాలను తీసుకున్నారు. టికెట్లు ఆశిస్తున్న వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశి స్తున్న నాయకులు పెద్ద ఎత్తున తమ అనుచరులతో తరలివచ్చి పరిశీలకునికి దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ పార్లమెంట్‌తో పాటు అ సెంబ్లీ స్థానాన్ని బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ కేటాయించాలని మైనార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ హఫీజ్‌ఖాన్, సయ్యద్ అఫాన్ అలీ, బషీరుద్దీన్, మేకల వెంకన్న తమకే అవకాశం కల్పించాలని వినతిపత్రాలు అందజేశారు. అదే విధంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే అవకాశం కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి వినతిపత్రం అందించారు. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో అవకాశం కల్పించాలని ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరగా, తనకే అవకాశం కల్పించాలని పీసీసీ కార్యదర్శి సుంకరి మల్లేష్‌గౌడ్ వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌కు పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు పెరిక వెంకటేశ్వర్లు, బాషపాక హరికృష్ణ, మునాస వెంకన్న వినతిపత్రం అందించారు. దేవరకొండ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు జగన్‌లాల్ నాయక్, గతంలో పీఆర్పీ అభ్యర్థి వడ్త్యా రమేశ్ వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కొందరు నాయకుల కొద్దిసేపు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది.
కోమటిరెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలి
సాక్షి, న ల్లగొండ : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమించాలని ఏఐసీసీ పరిశీలకుడు రఫీఖ్ అహ్మద్‌ను మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుమ్మల మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు వారిచ్చిన వినతిపత్రంలో పేర్కొరు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని, తన మంత్రి పదవిని త్యాగం చేశారని వివరించారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు.
మైనార్టీ నాయకుల ఆగ్రహం
అభిప్రాయ సేకరణ కోసం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ రఫీఖ్ ఆహ్మద్ ఎదుట ఆ పార్టీ మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30ఏళ్లుగా నల్లగొండ అసెంబ్లీ స్థానంలో మైనార్టీలకు, బీసీలకు అవకాశం కల్పించకుండా కేవలం ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారని మైనార్టీ నాయకులు హఫీజ్‌ఖాన్, ముంతాజ్ అలీ, రఫీయొద్దీన్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని ఫిర్యాదు చేశారు. ‘‘మీ అభిప్రాయాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడమే తనపని. బీఫారాలు ఇచ్చేవాన్ని కాదు. మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తా.’’ అని రఫీఖ్ అహ్మద్ వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు.
కాంగ్రెస్ ఆశావహుల సందడి
Published Sun, Jan 12 2014 4:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement