సాక్షి, మంచిర్యాల : దీపావళి టపాసుల విక్రయాలు పలు శాఖల అధికారులపై కాసుల వర్షం కురిపించింది. అనుమతి లేకుండానే ఏర్పాటైన స్టాళ్లను తొలగించాల్సిన రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి పొందిన తర్వాతే స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మూడ్రోజుల క్రితమే జిల్లాలో టపాసుల స్టాళ్లు వెలిశాయి.
తూర్పు జిల్లాలో..
తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరులోని బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 54 షాపులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. మంచిర్యాలలోని కాలేజీ రోడ్డు ప్రాంతంలో 16 షాపులు, బెల్లంపల్లిలోని తిలక్‌స్టేడియంలో 20, కాగజ్‌నగర్ గాంధీచౌక్‌లో 8, ఆసిఫాబాద్‌లో 9, చెన్నూరులో 2 దుకాణాలకు జాయింట్ కలెక్టర్ అనుమతి లభించలేదు. నిబంధనల ప్రకారం.. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపాలిటీలకు రూ.500 చలానా చెల్లించి.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. తర్వాత రెవెన్యూ అధికారుల ద్వారా జాయింట్ కలెక్టర్ వద్దకు సంబంధిత ఫైలు పంపి వారి అనుమతి పొందిన తర్వాతే టపాసుల షాపులు నిర్వహించుకోవాలి. ఈ నెల 23న షాపు యజమానులు అన్ని శాఖల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ పొంది రెవెన్యూ అధికారులకు అందించారు. ఇంతవరకు షాపు నిర్వహణకు సంబంధించిన ఫైళ్లపై జాయింట్ కలెక్టర్ సంతకం కాలేదని విశ్వసనీయ సమాచారం. అయినా షాపు యజమానులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి టపాసులు విక్రయిస్తున్నారు.
మందలింపుతోనే సరి!
అనుమతి లేని విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు శుక్రవారం మంచిర్యాల రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మంచిర్యాలలోని కాలేజీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్దకు వెళ్లిన స్థానిక రెవెన్యూ సిబ్బంది విక్రయాలు నిలిపేయాలని సున్నితంగా మందలించి తిరిగొచ్చేశారు. కానీ సిబ్బంది వెనుదిరిగిన వెంటనే యజమానులు అమ్మకాలు మళ్లీ ప్రారంభించారు. మరోపక్క.. నిబంధనల ప్రకారం టపాసుల షాపులు జనావాసాల్లో కాకుండా ఊరి బయట, జనావాసాల నుంచి దూరంలో ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో నీళ్లు, ఫైర్ ఎక్సెంటషన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా అలాంటి వసతులు కనిపించలేదు.
‘రెవెన్యూ’ అనుమతి ఉందో లేదో?
ఈ విషయమై మంచిర్యాల అగ్నిమాపక శాఖ అధికారి, రాజన్నను వివరణ కోరగా.. మంచిర్యాలలో 16 షాపులకు గానూ నిర్వాహకులు రూ.500ల చలానాలు తమకు కట్టారని తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి ఉందా లేదా అనేది తమకు తెలియదని వివరణ ఇచ్చారు. అలాగే ఆర్డీవో చక్రధర్‌రావు వివరణకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.
ఇష్టారాజ్యంగా టపాసుల విక్రయం
Published Sat, Nov 2 2013 2:43 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement
Advertisement