కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే...కాకినాడ పూసలవారివీధి బుడంపేటకు చెందిన పెంకే అమ్మాజీ (44)కి మెడకింద భాగంలో కాయ ఏర్పడటంతో గత కొంతకాలంగా నొప్పితో బాధపడుతోంది. ఈ నెల 22వ తేదీన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చి ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరారు. ఈమెకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించగా ధైరాయిడ్ గ్రాండ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్రాండ్‌ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. మంగళవారం ఈమెకు ఆపరేషన్ చేసి గ్రాండ్‌ని తొలగించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకి తరలించారు.
కొంత సమయానికి తీవ్ర ఆయాసం, ఎగ ఊపిరి సంభవించడంతో వైద్యులు ఈమెకు ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన ఆయాసం తగ్గకపోవడంతో వైద్యులు ఊపిరితీసుకునేటట్లు చికిత్స అందించారు. అనంతరం మృతి చెందింది. వెంటనే బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆరోగ్యంగా ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చిన మా అమ్మ అమ్మాజీ వైద్యుల నిర్లక్ష్యం కారణగానే మృతి చెందిందని కుమారుడు ఆనందరావు ఆరోపించాడు. సకాలంలో వైద్యులు చికిత్స అందించి ఉంటే బతికేదన్నారు. ఆపరేషన్, వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని బంధువులతో ఆందోళనకు దిగారు. కేస్ షీట్ ఇవ్వాల్సిందిగా కోరినా వైద్యులు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై పోస్ట్‌మార్టమ్ చేయించుకోవాలని, అందులో వాస్తవాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారని వాపోయాడు. బం«ధువులు పోస్ట్‌మార్టమ్‌కి అంగీకరించకపోవడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలిపాడు. ఈ విషయమ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై 3వ యూనిట్ చీఫ్ డీఎస్‌వీఎల్ నరసింహంను వివరణ కోరగా పేషెంట్ ధైరాయిడ్ గోయ్‌ట్రీ సమస్యతో ఆసుపత్రికి రాగా, సర్జరీ చేసి ధైరాయిడ్ గ్రాండ్‌ని తొలగించినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ పూర్తి ఫిట్‌గా ఉందన్నారు. బీపీ లెవెల్స్ పెరిగి, గుండెపోటుకి గురై మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. వైద్యుల తప్పిదం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
Published Wed, Jun 28 2017 2:51 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
Advertisement
Advertisement