‘ప్రకాశం’లో కొత్తరకం జ్వరం, మహిళ మృతి
స్కబ్‌టైఫస్‌తో మహిళ మృతి
కందుకూరు, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్క్రబ్ టైఫస్ అనే కొత్తరకం జ్వరంతో మహిళ మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండకు చెందిన ఒక మహిళ అస్వస్థతకు గురై గత శనివారం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. ఆమెకు స్క్రబ్‌టైఫస్ (రికెట్సియల్) అనే కొత్తరకం జ్వరం సోకినట్లు నిర్ధారించి ఒంగోలు వెళ్లాలని డాక్టర్ ఖాదర్‌బాషా సూచించారు. ఒంగోలులో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తమిళనాడు, కేరళ, జమ్మూకాశ్మీర్, ిహ మాచల్‌ప్రదేశ్, అసోం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ జ్వరం అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. పేడపురుగును పోలి ఉండే టిక్స్‌మైట్ అనే పురుగు కుట్టడంవల్ల ఈ జ్వరం వస్తుందని తెలిపారు. ఆ పురుగు కుట్టిన ప్రాంతంలో ఎర్రగా కమిలి మధ్యలో నల్లగా కనిపిస్తుందని చెప్పారు. ఈ జ్వరం డెంగీకన్నా ప్రమాదకరమన్నారు.
లక్షణాలు.. : ముందుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం ఉంటాయి. వ్యాధి ముదిరితే కామెర్లు, ఫిట్స్, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.