మహిళా మావోయిస్టు మృతి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్: దండకారణ్యంలో మహిళా విభాగంలో పనిచేస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన గజ్జెల సరోజ ఊరఫ్ అమరక్క(50) అనారోగ్యంతో మృతి చెందారు. గత నెల 11న క్యాన్సర్‌తో అమరక్క అజ్ఞాతంలోనే అకాల మరణం చెందారు. విప్లవ సాంప్రదాయల ప్రకారంగా దండకారణ్యంలో అమరక్కకు మావోయిస్టు అగ్రనేతలు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు దశాబ్దాలపాటు సరోజ విప్లవోద్యమంలో పనిచేశారు.
ఆదిలాబాద్ జిల్లా నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అన్న అమరుడు గజ్జెల గంగారాం స్ఫూర్తితో ఆమె విప్లవోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. 1980లో ఆమె రహస్య జీవితంలోకి వెళ్లిపోయారు. ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలోనే రాష్ట్ర కార్యదర్శి నల్లా ఆదిరెడ్డి ఊరఫ్ శ్యాం ఆమెను వివాహం చేసుకున్నారు. కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో ఆదిరెడ్డి చనిపోయినా ఆమె విప్లవోద్యమంలో కొనసాగారు. అనారోగ్యం బాధిస్తున్నా విప్లవోద్యమంలోనే సరోజ తుదిశ్వాస విడిచారు.