
‘ఆ బంధం’ ఇక వద్దన్నదని..
మండపేట రూరల్ :వివాహేతర సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ మదాంధుడు ఓ మహిళను ఆమె బిడ్డల ముందే హతమార్చాడు. తర్వాత పురుగులమందు తాగి, అదే కత్తితో తానూ పొడుచుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట రూరల్ మండలం జెడ్.మేడపాడులో జరిగిన ఈ ఘాతుకం వివరాలు స్థానికులు, పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జెడ్.మేడపాడు చర్చి కాలనీలో నివసిస్తున్న నక్కా సత్యనారాయణ, సరస్వతి (34) దంపతులకు 8, 4 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, 5వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నారు. గతంలో వారు అనపర్తిలోని కంటి ఆస్పత్రి వద్ద కాఫీహోటల్ నడిపేవారు. అక్కడ ఉండగా పరిచయమైన అనపర్తి మండలం పొలమూరుపాకలుకు చెందిన గెద్దాడ త్రిమూర్తులుతో సరస్వతికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
మూడేళ్ల క్రితం సత్యనారాయణ కుటుంబం జెడ్.మేడపాడు చర్చి కాలనీలో ఇల్లు నిర్మించుకుని వచ్చేశారు. సత్యనారాయణ ఇప్పనపాడులో కాఫీ హోటల్ నడుపుతున్నాడు. ఊరు మారినా త్రిమూర్తులు సరస్వతి కోసం వస్తూనే ఉండేవాడు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నందున తమ సంబంధాన్ని కొనసాగించేందుకు సరస్వతి నిరాకరించసాగింది. ఈ క్రమంలో త్రిమూర్తులు శనివారం ఉదయం చర్చి కాలనీలోని సరస్వతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సత్యనారాయణ హోటల్ వద్ద ఉన్నాడు. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని త్రిమూర్తులు పట్టుబట్టడమే కాక పిల్లల ముందే సరస్వతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పడంతో కోపోద్రిక్తుడైన త్రిమూర్తులు తన దగ్గరున్న కత్తితో ఆమె ముఖం, కంఠం, భుజం, ఇంకా మరికొన్ని చోట్ల పొడిచాడు. భీతిల్లిన పిల్లలు కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలుచుకు వచ్చారు.
అప్పటికే మరణించిన సరస్వతి నెత్తుటి మడుగులో పడి కనిపించింది. ఈలోగా పురుగుమందు తాగి, కత్తితో పొడుచుకున్న త్రిమూర్తులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు మండపేట రూరల్ సీఐ పీవీ రమణ, ఎస్సై ఎల్.శ్రీను సిబ్బందితో అక్కడకు చేరుకుని త్రిమూర్తులును 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్‌ఓ మేకా శ్రీను, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లి కత్తిపోట్లకు గురై మరణించడాన్ని కళ్లారా చూసిన ముగ్గురు పిల్లలూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనతో చర్చి కాలనీలో కలవరం రేగింది.