మొయినాబాద్, న్యూస్‌లైన్: ప్యాసింజర్ ఆటోలాగా నమ్మించి అక్కాచెల్లెళ్లను ఎక్కించుకుపోయారు. కత్తితో బెదిరించి ఆభరణాలను దోచుకుపోయారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోల్‌కట్ట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామానికి చెందిన విజయలక్ష్మి, పరమేశ్వరి అక్కాచెల్లెళ్లు. వీరు మంగళవారం ఉదయం మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు.
మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు మొయినాబాద్ బస్‌స్టాప్‌లో నిరీక్షిస్తున్నారు. కాగా వీరిని ముందునుంచే గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ ఆటోలో వచ్చారు. ఆటో చేవెళ్లకు వెళ్తుంది.. వస్తారా..? అని అడిగారు. దీంతో అక్కాచెల్లెళ్లు ప్యాసెంజర్ ఆటోగా భావించి అందులో ఎక్కారు. ఆటో మార్గంమధ్యలో ఆపకుండా నేరుగా మండలంలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వైపు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. దీంతో వారికి అనుమానం వచ్చి అడిగారు. పక్కనే కూరగాయలు ఉన్నాయని, వాటిని తీసుకొని చేవెళ్లకు వెళ్దామని చెప్పడంతో వారు మిన్నకున్నారు. కొద్దిదూరం లోపలికి తీసుకెళ్లి ఆటో ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు నగలు (కమ్మలు, గొలుసులు)తో పాటు 30 తులాల వెండి పట్టాలు దోచుకొని మహిళలను అక్కడే వదిలేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోడ్డుపైకి వచ్చారు. స్థానికుల సాయంతో చేవెళ్ల పోలీసులను ఆశ్రయించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరిధి మొయినాబాద్ ఠాణాలోకి వస్తుందని తెలిపారు. దీంతో బాధితులు సీఐ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
అక్కాచెల్లెళ్ల నుంచి ఆభరణాల దోపిడీ
Published Wed, Sep 25 2013 3:59 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM
Advertisement
Advertisement