పుత్తూరులో మహిళ, ఇద్దరు చిన్నారుల లొంగుబాటు | woman, two children Surrender in Puttur | Sakshi
Sakshi News home page

పుత్తూరులో మహిళ, ఇద్దరు చిన్నారుల లొంగుబాటు

Published Sat, Oct 5 2013 2:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

woman, two children Surrender in Puttur

చిత్తూరు: పుత్తూరు ఘటనలో  ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు.  పుత్తూరు ఇంట్లో దాక్కున్నవారంతా అల్-ఉమ ఉగ్రవాదులేనని తేలింది. పుత్తూరులో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది.  ఆ ఇంట్లో మరో ఇద్దరు ఉన్నట్లు  అనుమానిస్తున్నారు.

చెన్నై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్ట్ చేసిన అల్-ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు.  దుండగులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో  ఒక కానిస్టేబుల్ మరణించినట్లు సమాచారం.  సీఐ లక్ష్మణ్  తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా యావత్తు బెంబేలెత్తిపోతోంది. పుత్తూరులో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తనిఖీలు చేపట్టిన పోలీసులపై దుండగులు కత్తి, రాళ్లతో దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

 చిత్తూరు జిల్లా ఎస్పీ  కాంతిరాణా, తమిళనాడు ఎస్‌ఐబీ ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న డీజీపీ బి. ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను అల్‌-ఉమా సంస్థకు చెందిన అబూ బకర్, ఫక్రుద్దీన్ అహ్మద్, బిలాల్‌గా అనుమానిస్తున్నారు. శుక్రవారం చెన్నై పోలీసులు ఫక్రుద్దీన్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి పుత్తూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు,  స్థానిక సీఐ సాయంతో ఆపేరషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు.... ఆర్ఎస్‌ఎస్, బీజేపీ, భజరంగ్‌దళ్ నేతలు లక్ష్యంగా పలుసార్లు హత్యప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత రమేష్‌ను హత్య చేశారు. గత 18 నెలల్లో హిందూ సంస్థలకు చెందిన 16 మందిని అల్‌-ఉమా ఉగ్రవాదులు హతమార్చినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి.

తమిళనాడు బీజేపీ నేత రమేష్ హత్యకేసు నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  2011లో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కూడా కుట్ర చేశారు. అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్‌-ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు జరిగింది కూడా అల్‌-ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement