కరప(కాకినాడ): నాయకులు వస్తున్నారు, పోతున్నారే కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు నిలదీశారు. మండల పర్యటనలో భాగంగా గురువారం గొర్రిపూడి, పాతర్లగడ్డ, జి.భావారం, కరప గ్రామాల్లో చిన రాజప్ప పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కరపలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి రైతులకు రాయితీపై వచ్చిన ఆయిల్ ఇంజన్లు, టార్పాలిన్లు, పవర్ టిల్లర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన కారు ఎక్కబోతుంటే మహిళలు చుట్టుముట్టి రోడ్డు లేక నడవలేకపోతున్నామని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
మంచినీటి కుళాయి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఎంతో దూరం వెళ్లి బిందెలతో తెచ్చుకోలేకపోతున్నా.. మా బాధలు మీకు పట్టవా అని కొత్తపేట సామిల్లు సమీపంలోని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కల్పించుకుని సద్దిచెప్తున్నా మంత్రి సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ఇతర నాయకులు ఒక్కొక్క పని చేసుకొస్తున్నామని చెప్పారు. మీ వీధి రోడ్డు, కుళాయి వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇలా గొడవ చెయ్యడం మంచి పద్ధతి కాదని సద్దిచెప్పడంతో మహిళలు వెనుతిరిగారు.