తల్లీ! ఎంత తల్లడిల్లి ఇంతకు తెగించావో! | women attempted suicide | Sakshi
Sakshi News home page

తల్లీ! ఎంత తల్లడిల్లి ఇంతకు తెగించావో!

Published Sat, Mar 8 2014 2:07 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

women attempted suicide

 పిఠాపురం, న్యూస్‌లైన్ :
 కాయకష్టం చేసినా భార్యాబిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తపన పడే ఆ ఇంటి యజమాని.. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయంలా నాలుగిళ్లలో పని చేస్తూ భర్తపై భారాన్ని తగ్గించాలని ఆరాటపడే భార్య.. వారి కలల పంటగా ముద్దుల మూటగట్టే ఇద్దరు పిల్లలు.. ఆ కుటుంబం ఆప్యాయతానురాగాలే తరగని సిరిగా ఉన్నంతలో ఆనందంగానే గడుపుతోంది. అతడికి ప్రమాదకరమైన వ్యాధి సోకింది. ఓవైపు చికిత్స చేయించే స్తోమతు లేక, అభిమానం చంపుకొని ఎవరినీ సాయం కోసం యాచించలేక, మరోవైపు భర్తకు ఏమైనా అయితే.. అతడు లేని లోకంలో తాను, బిడ్డలు అనాథలుగా మిగులుతామన్న ఊహనే భరించలేక..  ఇద్దరు బిడ్డలతో కలిసి లోకం నుంచే నిష్ర్కమించాలనుకుంది. ఆ ప్రయత్నంలో ఆమెను కడలి పొట్టన పెట్టుకోగా.. జాలరుల పుణ్యమాని పసి ప్రాణాలకు గండం తప్పింది.
 
 పిఠాపురం కత్తులగూడెంకు చెందిన ఈపు సూర్యావతి (28) శుక్రవారం ఉదయం 11.30 సమయంలో తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఉప్పాడ వద్ద జియోట్యూబ్ రక్షణగోడ నుంచి సముద్రంలోకి దూకింది. ఆమె కెరటాల్లో చిక్కుకుని మరణించగా.. పిల్లలిద్దరినీ జాలరులు కాపాడారు. పోలీసులు, సూర్యావతి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి కత్తులగూడెంకు చెందిన సూర్యావతికి జగ్గంపేట మండలం గొర్లగుంటకు చెందిన శ్రీనుతో 2006లో పెళ్లైంది. వారికి నాలుగేళ్ల అప్పన్న (అనిల్), మూడేళ్ల దేవి అనే  పిల్లలున్నారు. ఈ కుటుంబం కత్తులగూడెంలోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. శ్రీను కూలిపనులుకు వెళుతుండగా సూర్యావతి కొన్ని ఇళ్లలో పనిమనిషిగా కుదిరి భర్తకు ఊతంగా నిలుస్తోంది. ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్న ఆ దంపతులు అనిల్‌ను ఓ కాన్వెంట్‌లో చేర్చి, దేవిని అంగన్‌వాడీ బడికి పంపుతున్నారు. శ్రీను ఇటీవల అస్వస్థతకు గురై వైద్యులకు చూపించుకుంటే మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతగా నిర్ధారణైంది.
 
  చికిత్సకు లక్షలు ఖర్చవుతాయనడంతో ఆ దంపతులకు దిక్కుతోచ లేదు. ఈ నేపథ్యంలో సూర్యావతి తన ఇద్దరు బిడ్డలనూ తీసుకుని పిఠాపురం నుంచి ఉప్పాడ బీచ్ రోడ్ సెంటర్‌కు చేరుకుని, అక్కడి శివాలయం సమీపంలో జియోట్యూబ్ రక్షణ గోడ నుంచి సముద్రంలోకి దూకేసింది. ఆ పాటుకు ఆమె చేతి పట్టు నుంచి జారిపోయిన పసివాళ్లు బండరాళ్లను పట్టుకుని గోలుగోలున విలపించారు. వారిని గమనించిన సమీపంలోని ముగ్గురు జాలరులు సముద్రంలోకి దూకి పిల్లలిద్దరినీ కాపాడారు. పిల్లలు తల్లి కూడా మునిగిపోతోందని చెప్పడంతో తిరిగి వెళ్లి గాలించగా అప్పటికే మరణించిన సూర్యావతి కనిపించింది. ఈ సంఘటనతో పిఠాపురం కత్తులగూడెంలో విషాదం అలముకుంది.  
 
 అమ్మ అప్పచ్చిలు కొనిపెడతానంది..
 ‘అమ్మ నన్ను పొద్దున్నే స్కూలుకు పంపింది. తర్వాత చెల్లిని తీసుకు వచ్చి నాకు టిఫిన్ తినిపించాలని మాస్టారుతో చెప్పింది. ఇద్దరికీ అప్పచ్చిలు కొనిపెడతానంది. చెల్లిని ఎత్తుకుని, నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కొండెవరం వరకు తీసుకెళ్లాక అక్కడ ఆటోఎక్కించింది. ఆటో దిగాక సముద్రం దగ్గరకు తీసుకెళ్లి ఇద్దరినీ పట్టుకుని నీళ్లలోకి దూకేసింది. నేను ఉప్పునీరు తాగేశాను. చెల్లి ఏడుస్తోంది. ఇంతలో ముగ్గురు వచ్చి మమ్మల్ని బయటకు తెచ్చారు. ‘అమ్మ మునిగిపోతోంది’ అంటూ మేము ఏడవడంతో వాళ్లే వెళ్లి అమ్మను వాళ్లు తీసుకొచ్చారు’.. కన్నతల్లి కడలి పాలైన వైనం గురించి బరువెక్కిన లేతగుండెతో నాలుగేళ్ల అనిల్ తనకు చేతనైన రీతిలో చెప్పిన వివరాల సారాంశం ఇది. మూడేళ్ల దేవికి బంధువులు అన్నం తినిపించబోగా ‘అమ్మ తినిపిస్తేనే తింటాను’ అని మారాం చేయడం అందరి హృదయాలనూ కలచివేిసింది.
 
 ఆమె ప్రేమతోనే రోజులు నెట్టుకొస్తున్నా..
 ఉదయమే వేరే ఊళ్లో కూలిపనికి వెళ్లి విషయం తెలిసి వచ్చిన శ్రీను విగతజీవి అయిన భార్యను చూసి బావురుమన్నాడు. అనారోగ్యంతో ఉన్న తనను కంటిని రెప్పలా కాచుకుందని, ఇలా తనను వదిలి వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదని రోదిస్తుంటే ఓదార్చడం కష్టతరమైంది. ఒక్కగానొక్క కూతురు తమ కళ్లెదుటే ఉంటే అండగా ఉండొచ్చని పిఠాపురంలో కాపురం పెట్టించామని, తనువు చాలించిందని సూర్యావతి తల్లిదండ్రులు గింజాల నాగమణి, రాంబాబు  విలపించారు. సూర్యావతి గత రాత్రి నుంచి దిగులుగా ఉందని, ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిందని ఇంతటి కఠోర నిర్ణయం తీసుకుందని ఊహించలేకపోయామని ఇరుగుపొరుగువారు కంటతడి పెడుతున్నారు.
 
 స్నానం చేయడానికి వచ్చారనుకున్నాం..
 రోజూ చాలామంది సముద్రంలో స్నానం చేయడానికి వస్తారు. బిడ్డలను తీసుకుని మా ముందు నుంచే వెళ్లిన ఈమె కూడా అలాగే స్నానానికి వచ్చిందనుకున్నాం. కాసేపటికి దూరంగా పిల్లలు మునిగిపోతూ కనిపించారు. పరుగున వెళ్లి పిల్లలను ఒడ్డుకు తెచ్చాం. వాళ్లు అమ్మ మునిగిపోతోందని చెప్పడంతో మళ్లీ వెళ్లి ఆమెను ఒడ్డుకు తెచ్చేసరికే చనిపోయింది’ అంటూ పిల్లలను కాపాడిన శ్రీను, రాజన్న, లక్ష్మణ్ అనే జాలరులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తడిసి ముద్దయి, వణికిపోతున్న పిల్లలకు పొడిబట్టలు వేసి ఆస్పత్రికి తీసుకు వెళ్లామని చెప్పారు. కాగా అనిల్ తాను చదివే స్కూలు పేరు చెప్పడంతో వివరాలు తెలిశాయని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement