హడలెత్తిస్తున్న 'అంగడి బొమ్మ' ముఠాలు
ఆడపిల్లలను అంగడి బొమ్మలుగా మారుస్తున్న ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఈ ముఠాలకు ముక్కుతాడు పడడం లేదు. మాయమాటలతో మహిళలను వంచించి మురికి కూపంలోకి లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల మంది వ్యభిచార రొంపి దించుతున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందే అర్థమవుతోంది. మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. 'సెక్స్ ట్రాఫికింగ్' ఏటేటా పెరుగుతుండడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
మహిళల రక్షణపై తెలంగాణ సీఎం కేసీఆర్ నియమించిన కమిటీ 'సెక్స్ ట్రాఫికింగ్'పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అబలలను బలవంతంగా వ్యభిచార రొంపికి దింపుతున్నారని వెల్లడించింది. దొంగ పెళ్లిళ్లు చేసుకుని ఆడవాళ్లను అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మతాచారాల పేరుతో దేవదాసి, జోగినిలుగా ముద్రవేసి మురికి కూపంలోకి తోస్తున్నారని తెలిపింది. ఉద్యోగాలతో పేరుతో వంచించి వనితలను పడుపు వృత్తిలోకి దించుతున్నారని పేర్కొంది. అయితే కామపిచాచుల బారిన పడిన వారిలో 72 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందినవారని కమిటీ వెల్లడించింది.
మహిళల అక్రమ రవాణా అనేది సామాజిక సమస్యగా కంటే సంస్థాగత నేరంగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మహిళ భద్రత మాటలకే పరిమితమైందని పేర్కొంది. మనుషుల అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్ఎస్ యూ) చేతులు ముడుచుకుని కూర్చోవడంతో స్త్రీలకు రక్షణ కరవయిందని తెలిపింది. మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న వారి జాతకాలు బయటపెడితే జనం జాగ్రత్త పడటానికి అవకాశముంటుందని సూచించింది. ఇటువంటి వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలున్నప్పటికీ వీటిని చిత్తశుద్ధితో అమలుచేసే వారే లేకపోవడమే ఈ దారుణ స్థితికి కారణం. పాలకులు ఇకనైనా కళ్లుతెరవాలి.