హైదరాబాద్: ఘర్షణకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తనను రాగడే ఎస్సై రామచందర్ కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధిత మహిళ బాలమణి సోమవారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఈనెల 17న తమ ఇంటి సమీపంలోని వారితో ఘర్షణ జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని తెలిపారు. అయితే ఎస్సై తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడని, రాత్రి 9 గంటల తర్వాత ఒక్కదానివే రావాలంటూ బెదిరింపులకు గురిచేశాడని వాపోయింది.
కోరిక తీర్చకపోతే కేసు నమోదు చేయనని, ఇతరులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాడని కన్నీటిపర్యంతమైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.