► స్త్రీల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
► అధికారం అండగా పేట్రేగుతున్న టీడీపీ నేతలు
► ప్రశ్నిస్తే చాలు దాడులతో విరుచుకుపడుతున్న వైనం
► నిందితులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు
‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు’ అన్న సామెత చంద్రబాబు ఆయన అనుచర గణానికి అచ్చం అతికినట్లు సరిపోతుంది. ‘ఆకాశంలో సగం.. అన్నింటా అందలం’ అంటూ ఓ వైపు ఆర్భాటంగా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తూ, మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు సర్కారు వాస్తవంగా వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. పచ్చ నేతల దౌర్జన్యకాండతో రాష్ట్రంలోని మహిళా అధికారులు, సామాన్య మహిళలకు భద్రత కరువైంది.
సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా ఘటనల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలే నిందితులు కాగా, మిగతా ఘటనల్లో నిందితులకు వత్తాసు పలుకుతోందీ ఆ పార్టీ నేతలే. ఏ ఘటనలోనూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జనం ఉద్యమించి గోల చేస్తే తూతూ మంత్రంగా చర్యలతో మమ అనిపిస్తూ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయన శిష్యగణం వల్ల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య ఘటనలను పరిశీలిస్తే రాష్ట్రంలో మహిళలు ఏ రీతిన అన్యాయాలకు, అకృత్యాలకు గురవుతున్నారో తేటతెల్లమవుతోంది.
ర్యాగింగ్ రక్కసికి మద్దతా?
నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మొండి రిషితేశ్వరి(18) ర్యాగింగ్ రక్కసికి బలైపోయిన ఘటనలో సర్కారు తీరుపై ఎంతగా విమర్శలు వచ్చినా మొద్దు నిద్ర వీడలేదు. వర్సిటీలో చదువు నరకప్రాయంగా మారిందని, ప్రేమించాలంటూ బలవంతం చేస్తున్నారని, ర్యాగింగ్ పేరుతో వేధింపులు ఆపాలని జూలై 14, 2015న ఆమె సూసైడ్‌నోట్ రాసి వసతి గృహంలో చున్నీతో ఉరి వేసుకుంది. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహార శైలిని తప్పుపట్టింది. ఈ ఘటనకు ఆయనే కారకుడని, ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావును, దోషులను కాపాడటానికి టీడీపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేసిందో రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలుసు.
అడ్డుకోవడమే పాపమైపోయింది..
ఇసుక మాఫియాను అడ్డుకున్నారని కృష్ణా జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని గ్యాంగ్ తాహసీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడి చేయడం మహిళా అధికారుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని పెంచింది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద జూలై 8, 2015న తమ్మిలేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి ఇదేమిటని ఇసుకాసురులను ప్రశ్నించింది. అక్రమ రవాణా సాగడానికి వీల్లేదని ఆమె దారికి అడ్డంగా కూర్చోగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన మద్దతుదారులు వనజాక్షిపై దౌర్జన్యానికి దిగి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారు. ఇసుక క్వారీలోనే ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పరిధి దాటి వ్యవహరించినందున తహసీల్దార్ వనజాక్షిదే తప్పు అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇదే చింతమనేని గత ఏడాది డిసెంబర్ 21న.. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజనం మహిళ కార్మికుల వద్దకు వచ్చి నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు.
నడిరోడ్డుపై దుశ్శాసనపర్వం
అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు సుధమ్మ అనే ఒంటరి మహిళను నడిరోడ్డులో చెప్పు కాళ్లతో ఈడ్చి కొడుతుంటే విడిపించే దిక్కులేకుండా పోయింది. ఈ నెల 2వ తేదీన కూడేరు మండలం జల్లిపల్లిలో తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్రలు ఆమెపై దాడి చేసిన దృశ్యాలు టీవీ చానళ్లలో వీక్షించిన జనం ‘ఇదేమి రాజ్యం.. ఇదేం పాలన’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇంటి ఎదుట కాకుండా, కొంచెం పక్కన నీటి తొట్టె నిర్మించుకోండని చెప్పడమే పాపమైపోయింది. న్యాయం చేయండయ్యా అని పోలీస్‌స్టేషన్ కెళ్లిన ఆమె కళ్లెదుటే పోలీసులు.. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం నివ్వెరపరిచింది.
పేద మహిళలను చెరబట్టిన కాల్‌నాగులు
విజయవాడలో అధికార పార్టీ నేతల అండతో కాల్‌మనీ గ్యాంగులు పేద మహిళలను చెరబట్టాయి. అధిక వడ్డీకి అప్పులివ్వడం, చెల్లించలేని వారి ఆస్తులు తీసుకోవడమే కాక 200 మందికి పైగా మహిళలను లైంగికంగా దోచుకుని ఆకృత్యాలకు పాల్పడ్డాయి. వీడియో చిత్రీకరణలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ‘పచ్చ కాల నాగులు’ సాగించిన దురాగతాలు చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు కొలువు తీరిన విజయవాడలో సభ్య సమాజం తల దించుకునే స్థాయిలో కాల్ మనీ పేరుతో సెక్స్ రాకెట్ సాగించిన తీరు సిగ్గు చేటు అని మహిళా లోకం నినదించినా బాబు సర్కారు మాత్రం నిస్సిగ్గుగా తుడిచేసుకుంది. బాధితులు ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం పలుకుబడిని ఉపయోగించి ఈ వ్యవహారం పెద్దది కాకుండా చూసింది.
ఆక్వాఫుడ్ పార్క్ వద్దన్నందుకు హత్య కేసా?
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ కాలుష్యం వల్ల తమ బతుకులు తెల్లారిపోతాయన్న ఆరేటి సత్యవతిపై బాబు ప్రభుత్వం హత్యానేరం కేసు పెట్టించి రిమాండ్‌కు పంపింది. ఈ పార్కు ఏర్పాటు వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని, తమకు ఉపాధి కరువవుతుందని చెప్పిన స్థానికులపై టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనుచరులు దాడికి దిగారు. గత ఏడాది నవంబర్ 29న జన చైతన్యయాత్ర పేరుతో నరసాపురం మండలం కే. బేతపూడి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సమక్షంలోనే టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బయోత్పాతం సృష్టించారు. ఆ దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా దివీస్ మందుల ఫ్యాక్టరీ కాలుష్యంతో వేలాది మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, హేచరీలపై ప్రభావం పడుతుందని ఉద్యమించిన మహిళలపై కూడా ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తోంది.
సీఎంను విమర్శించారని గిరిజన ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు
బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసినందుకు వైఎస్‌ఆర్సీపీకి చెందిన గిరిజన నియోజకవర్గం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు దేశద్రోహం కింద 2015 డిసెంబర్ 18న కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై హైకోరు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు చట్టాన్ని వాడుకోరాదని స్పష్టం చేసింది. దేశద్రోహం కింద పోలీసులతో ఇలా కేసులు పెట్టించడం అధికార దుర్వినియోగమే అవుతుందని అభిప్రాయపడింది.
మంత్రి రావెల తనయుడి కీచకపర్వం
బాధితులకు అండగా ఉండి న్యాయం జరిపించాల్సిన మంత్రి తనయుడే ఓ యువతి పట్ట కీచకుడిగా వ్యవహరించాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 18 అంబేడ్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమా బేగం అనే టీచర్ గత ఏడాది మార్చి 4న ఇంటికి వెళుతుండగా మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ వెంబడించాడు. తన డ్రైవర్‌తో కలసి నంబర్ ప్లేట్ లేని కారులో వెంటపడి ఆమె చెయ్యి పటుకుని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసేందుకు యత్నించాడు. ఆమె భయంతో అరవడంతో చుట్టు పక్కల ఉన్నవారు గమనించి సుశీల్‌ను చితకబాదారు. మంత్రి, ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి బాధితులపైనే ఎదురు కేసు బనాయించారు.
జిల్లా ప్రథమ మహిళకే అన్యాయం
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేస్తూ మీడియా ఎదుట బోరున విలపించడం చూసి ప్రజానీకం విస్తుపోయింది. తాను చేసిన సిఫార్సులను మంత్రి బుట్టదాఖలు చేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మంత్రి మనుషులను తన ఇంటిపైకి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని గత డిసెంబరు 28న ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించాలని గుంటూరు రూరల్ ఎస్పీకి వినతి పత్రం సమర్పించింది. ఇంత జరిగినా సదరు మంత్రిపై మఖ్యమంత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
సినిమాను తలపించిన ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్
ప్రొఫెసర్ వేధింపులతో గుంటూరు జీజీహెచ్‌లో గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్యహత్య చేసుకున్న ఘటనలో నిందితురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయకుండా సర్కారు సాగించిన హైడ్రామా సినిమాను తలపించింది. తనను ప్రొఫెసర్ లక్ష్మి తీవ్రంగా వేధిస్తోందని, ఇక భరించడం తన వల్ల కాదని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితురాలి భర్త టీడీపీ మద్దతుదారుడు కావడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి అన్ని విధాలా సహకరించారు.
ఎంపీ కుమార్తెకే దిక్కులేదు..
సామాన్యులే కాదు.. ఏకంగా చిత్తూరు టీడీపీ ఎంపీ కుమార్తెపై దౌర్జన్యం చేసినా ఈ సర్కారు స్పందించ లేదు. ఈ నెల 8న ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత తిరుపతిలో కారులో వెళ్తుండగా ఒక కారు రోడ్డుకు అడ్డంగా కనిపించింది. దానిని పక్కకు తీయాలని ఆమె కారు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉంచిన కారు యజమాని, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బంధువు నరేంద్రకు చెప్పాడు. అతను, అతని అనుచరులు డ్రైవర్‌ను, డాక్టర్ మాధవీ లతపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారు. న్యాయం కోసం ఆమె నాలుగు గంటల పాటు రోడుపై బైఠాయించింది. ‘ఈ ప్రభుత్వంలో ఎంపీ కుమార్తెకే న్యాయం జరగదా?’ అని బాధితురాలు వాపోయారు.
► అధికార టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి గత ఏడాది అక్టోబర్ 20న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
► విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గత ఏడాది మే 14న ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే విమానంలో పక్క సీట్లో కూర్చొన్న ఓ మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తెలుగుజాతి పరువు తీశారు.
► గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని సాక్షాత్తు డీజీపీనే ప్రకటించారు. దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నలుగురు మంత్రుల్లో ఇద్దరు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.
► కర్నూలు జిల్లా ఆర్.కొంతలపాడులో డిసెంబర్ 18న టీడీపీకి చెందిన ముగ్గురు అత్యాచారం చేస్తే.. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
► ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం నేతల చెరువు ఆక్రమణలను అడ్డుకోబోయిన చిన్నగొట్టికల్లు తహసీల్దార్ నారాయణమ్మపై రంగన్నగారిగడ్డ పంచాయతీ టీడీపీ నేత, సర్పంచ్ రమణారెడ్డి, మరికొందరు దుర్భాషలాడారు.
► వేతనాల పెంపు జీవోను విడుదల చేయాలని అంగన్వాడీ మహిళలు 2015 డిసెంబర్18న విజయవాడలో ఆందోళనకు దిగితే చంద్రబాబు సర్కారు పోలీసుల ద్వారా వారిపై దాడి చేయించింది. మగ పోలీసులు చీరలు లాగి, జుట్టు పట్టి ఈడ్చిపారేశారు. 60 మంది మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు.