సాక్షి, అమరావతి: అనాదిగా అల్లరిమూకలు, అరాచక శక్తుల రాక్షస క్రీడకు బలైపోతున్న మహిళల గుండె మంటల్ని చల్లార్చి.. గుండె ధైర్యాన్ని కలిగించేలా ‘దిశ’ చట్టం ఉండనుందన్న నమ్మకం కలుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభలో శుక్రవారం ‘దిశ’ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల తలపై ఉన్న మూడు సింహాలు, కనిపించని నాలుగో సింహం ఒక్కటై.. ఆడవాళ్లను హింసించే మానవ మృగాలను వెంటపడి వేటాడతాయన్న నమ్మకాన్ని ఈ చట్టం కలిగిస్తోందన్నారు. అన్యాయానికి గురైన మహిళల తరఫున చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మహిళా లోకానికి ధైర్యం కలిగిందన్నారు.
నిర్భయ, పోక్సో, వరకట్న వేధింపులు చట్టం, ఐపీసీ, పటిష్టమైన న్యాయవ్యవస్థ, గొప్ప పోలీసు వ్యవస్థ అన్నీ ఉన్నప్పటికీ ‘దిశ’ ఘటన తరువాత ఆ చట్టాలు దోషులను శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికీ కలగలేదని ఆమె అన్నారు. అందుకే దిశను దారుణంగా చంపిన ఆ నలుగురూ ఎన్‌కౌంటర్ అయితే శభాష్ పోలీస్ అని ప్రశంసించారన్నారు. ‘చట్టమంటే భద్రత, భయం రెండూ కలిగించాలి. అలా కానప్పుడు అది బలవంతులకు చుట్టమే కానీ బలహీనులకు న్యాయం చేసే చట్టం అవ్వదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరిస్ధితుల్లో మార్పు తెచ్చేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ‘దిశ’ చట్టానికి రూపకల్పన చేశారన్నారు.
మహిళలకు శ్రీరామరక్ష
‘దిశ’ చట్టం మహిళలు, బాలల భద్రతకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు భీతిగొల్పుతున్నాయి. ఈ తరుణంలో ‘దిశ’ వంటి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించడం ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర మహిళలు అందరికీ భరోసా కల్పించారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను నిరీ్ణత గడువులోగా శిక్షించేలా చట్టం రూపకల్పన చేయడం హర్షణీయం.అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలుస్తుంది.
– తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
చారిత్రక చట్టమిది
మహిళలు, బాలలపై నిర్దేశిత నేరాలను త్వరగా విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు దిశగా నడుం కట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు చాలామంది సానుభూతి చూపిస్తారు. కానీ.. తక్షణ న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం చేయరు. ఇలాంటి సందర్భంలో దేశంలోనే తొలిసారి ముఖ్యమంత్రి తక్షణ న్యాయం దిశగా ఆలోచన చేశారు. ఇంతటి చారిత్రక బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో లేనందుకు చంద్రబాబు, టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యే
విస్తృత ప్రచారం కల్పించాలి
మహిళల జోలికి వచ్చే వారికి వెన్నులో చలి పుట్టించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చట్టాన్ని తీసుకువచ్చారు. ఇందుకు మహిళాలోకం యావత్తు ‘సాహో జగనన్నా.. జయహో జగనన్నా’ అంటున్నారు. మహిళలపై నేరాలకు 80 శాతం కారణం మద్యపానమే. దాన్ని కూడా దశల వారీగా నిషేధించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఈ చట్టంపై స్కూళ్లు, కళాశాలల్లో విస్తృత ప్రచారం కలి్పంచాలి.
– విడదల రజని,చిలకలూరిపేట ఎమ్మెల్యే
మహిళల్లో మనోధైర్యం పెరుగుతుంది
ఏపీ దిశ చట్టంతో మహిళల్లో మనోధైర్యం పెరుగుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2016, 2017, 2018 సంవత్సరాల్లో రాష్ట్రంలో మహిళలపై 50,238 అఘాయిత్యాలు జరిగితే బిహార్‌లో 42,015 జరిగాయి. మహిళలపై దురాగతాలలో అప్పట్లో మన రాష్ట్రం బిహార్‌ను మించిపోయింది. మహిళల భద్రతపై సోమవారం చర్చ జరిగినప్పుడు ఉల్లిపాయలంటూ చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడితే మార్షల్స్ అంటూ బయటకు వెళ్లిపోయారు.
– నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే
ప్రతి మహిళా హర్షిస్తుంది
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మనసున్న మారాజు. మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం విషయంలో రెండింతలు ఎక్కువ అవకాశం కల్పించారు. ఈ చట్టంతో 21 రోజుల్లోనే శిక్షను ఖరారు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే శిక్షలు విధించేందుకు చట్టం చేయడాన్ని దేశంలోని ప్రతి మహిళా హర్షిస్తుంది. జీరో ఎఫ్‌ఐఆర్ విధానం మహిళలకు భద్రత కలిగిస్తోంది. స్త్రీ ఉన్నతికి తోడ్పడుతుంది.
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
ఇదో వజ్రాయుధం
గృహ హింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, 21 రోజుల్లో తీర్పు అనే అంశాలతో దిశ చట్టం రూపకల్పన చేసుకుంది. ఇకపై ఎవరైనా సోషల్ మీడియాలో ఫొటో మారి్ఫంగ్, ప్రొఫైల్ హ్యాకింగ్, అసభ్య, తప్పుడు సందేశాలు పెట్టినా ముఖ్యమంత్రి జైల్లో పెడతారన్న భయంతో క్రిమినల్స్‌లో దడ పుడుతుంది. దిశ చట్టం చరిత్రాత్మకం. ఈ చట్టం మహిళల పాలిట వజ్రాయుధం.
– కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే
జీరో ఎఫ్‌ఐఆర్‌తో నేరాల నిరోధం
హద్దులు, పరిమితులతో సంబంధం లేకుండా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం వల్ల మహిళలపై నేరాలు తగ్గుతాయి. దిశ చట్టంపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే. రిషితేశ్వరి, వనజాక్షి వంటి ఘటనల మొదలు బాలకృష్ణ వ్యాఖ్యల వరకు ఎన్నెన్నో అకృత్యాలు జరిగాయి.
– ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే
కఠిన శిక్షలు లేక అఘాయిత్యాలు
కఠిన శిక్షలు పడకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన ఈ చట్టాన్ని తెలుగుదేశం సమర్ధిస్తున్నది. చట్టాన్ని తీసుకురావడంతో సరిపెట్టకుండా సక్రమంగా అమలు చేయాలి.
– ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే
మహిళా లోకం సంతోషిస్తుంది
దిశ చట్టం తీసుకు రావడంతో మహిళా లోకం చాలా సంతోషిస్తుంది. ఈ చట్టం త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఇందుకు హ్యూమన్ రైట్స్ తరఫున మేం కూడా సపోర్ట్ చేస్తాం. ఈ చట్టం పకడ్బందీగా అమలైతే మహిళలు, బాలికలపై ఎన్నడూ అత్యాచారాలు జరగవు. చేసేవాళ్లు భయపడతారని ఆశిస్తున్నాం.
–సరస్వతి , నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, తిరుపతి
‘దిశ’ చట్టాన్ని స్వాగతిస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం దిశ పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతిస్తున్నాం. ఐతే 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పటం అంటే అందుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. నేరం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వర్మ కమిషన్ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించాలి.
– డి.రమాదేవి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఐద్వా
Comments
Please login to add a commentAdd a comment