మహిళ మృతి, వివాహేతర సంబంధం, సునీత
భర్తా? ప్రియుడా?
హత్యకు ప్రేరేపించిన వివాహేతర సంబంధం
మిస్టరీగా గిరిజన వివాహిత హత్య
వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లాలో గిరిజన మహిళ హత్యకేసు మిస్టరీగా మారింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తుండగా.. ఇంతకీ హంతకుడు ఎవరన్నది అంతుచిక్కకుండా ఉంది. వీర ఘట్టం మండలంలోని దశుమంతుపురం పంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామసమీపంలో వివాహిత బిడ్డిక సునీత(35) శనివారం హత్యకు గురైన ఘటన విదితమే. ఆమెకు వేరొక వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను భర్త అంతమొందించాడా? లేదా, ప్రియుడే కాలయముడయ్యాడా? తేలాల్సి ఉంది. పాలకొండ డీఎస్పీ సి.హెచ్ ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు ఆదివారం సంఘటన స్థంలో ఉన్న సునీత మృతదేహాన్ని పరిశీలించారు. ఇమె బంధువులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై పలువురిని అడిగి ఆరా తీశారు. ఈ హత్యపై వీఆర్వో రామమూర్తినాయుడు ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై బి.రామారావు కేసు నమోదు చేశారు.
బంధువుల సమక్షంలో పంచనామా
పెద్దూరు గ్రామస్తులు, మృతురాలి బంధువుల సమక్షంలో పోలీసులు శవ పంచనామా చేశారు.అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధమే
పోలీసులు, హతురాలి భర్త గుండయ్య (మూగవాడు) చెబుతున్న వివరాల ప్రకారం.. కొనేళ్ళుగా సునీతకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రోజూ సునీతకు ఫోన్‌కాల్స్ వస్తుండేవని, ఇదే విషయమై ప్రశ్నిస్తే తన భార్య తన పట్ల నిర్లక్షంగా వ్యవహరించేదని గుండయ్య చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని జీడితోటలో ప్రియుడితో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సునీత కనిపించింది. దీంతో అతనికి గుండయ్యకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుండయ్య తన భార్యను గట్టిగా చేతితో తలపై కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న రాయిపై పడిపోయిందని, దీంతో ఆమె నోటికింద భాగంలో బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు పారిపోయాడని, అతను ఎవరనేది తెలుసుకొనేందుకు గుండయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ప్రియుడే హంతకుడు?
గిరిజన మహిళ కావడంతో ప్రియుడే ఆమెకు మాయ మాటలు చెప్పి మోసగించి, హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. మూగవాడైన గుండయ్యకు ఏ పాపం తెలీదని డీఎస్పీ ఆదినారాయణకు వివరించారు. సంఘటనా స్థలంలో రెండు సెల్‌ఫోన్లు దొరకడంతో ఆ వ్యక్తి ఎవరనేది కొద్ది రోజుల్లోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.
అనాథలుగా మిగిలిన పిల్లలు
సీతంపేట మండలం జయపురానికి చెందిన గుండయ్యకు, అదే మండలం కుసుమి పంచాయతీ బిల్లుగూడకు చెందన సునీతకు 2003 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు సంధ్యారాణి, సౌజన్య, కవిత అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మూగవాడు కావడం, తల్లి హత్యకు గురి కావడంతో ఆ ముగ్గురు పిల్లలు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలు కావడంతో అనాథలుగా మిగిలారు. ఆ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.