కాఫీలో విషమిచ్చి దోపిడీకి యత్నం
Published Sat, Sep 20 2014 2:47 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో ఓ మహిళ శుక్రవారం ముగ్గురు భక్తులకు కాఫీలో విషం కలిపి ఇచ్చి నగలు, నగదు దోచుకోవడానికి ప్రయత్నించింది. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయ సెక్యూరిటీ ఇన్‌చార్జి కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఒంగోలులోని కొత్తమావిళ్లపాళెం గ్రామానికి చెందిన సుబ్బారావు కుటుంబసభ్యులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆర్టీసీ బస్సులో వచ్చారు. తిరుపతికి చెందిన గౌరి(38) టీటీడీ ఉద్యోగినని వారిని బస్సులో పరిచయం చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చాక తన వద్ద ఉన్న ఫ్లాస్క్ నుంచి విషం కలిపిన కాఫీని (టీటీడీ అని ముద్రించి ఉన్న కప్పుల్లో) సుబ్బారావు కోడలు హరిప్రియ(27), మనవడు లక్ష్మీనారాయణ(8)కు ఇచ్చింది.
అక్కడే ఉన్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మార్కండేయులు భార్య పాపమ్మ (56)కి కూడా కాఫీ ఇచ్చింది. సుబ్బారావు, ఆయన కుమారుడు శ్రీనివాసులు, మార్కండేయులు కాఫీ వద్దని స్నానం చేయడం కోసం వెళ్లారు. కాఫీ తాగిన ముగ్గురూ పది నిమిషాల వ్యవధిలో స్పృహ కోల్పోయారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబసభ్యులు నిందితురాలిని పట్టుకొని సెక్యూరిటీకి అప్పగించారు. బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితురాలిని ఆలయ సెక్యూరిటీ విచారించగా.. తాను తిరుపతి పద్మావతిపురంలో ఉంటున్నాని... టీటీడీలో పనిచేసేటప్పుడు కాఫీ కప్పులు కొన్ని నిల్వచేశానని, కాఫీలో తాను విషం కలపలేదని.. వారు ఎందుకు పడిపోయారో తనకు తెలియదని చెప్పింది. తరువాత ఆమెను ఆలయ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
Advertisement