వాణిజ్యానికి ఇసుక షాక్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌ల్ని కట్టబెట్టిన ప్రభుత్వం ఈ ప్రతిపాదన వెనుక తన గొయ్యి తానే తవ్వుకుంటున్న విషయూన్ని గ్రహించలేకపోయింది. ఇప్పటికే టీడీపీ నేతలు, బినామీలతో నడుస్తున్న రీచ్‌ల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. రశీదుల్లేకుండా, ఒకే బిల్లుపై పలుమార్లు రవాణా, అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా టీడీపీ నాయకుల వాహనాల్లోనే ఇసుక బయటకు తరలిపోతుందనే విమర్శలున్నాయి. మరోవైపు భవన నిర్మాణదారులకు ఇసుక రావడం గగనంగా మారింది. గతానికి.. ఇప్పటికీ నాలుగు రెట్లపైనే ధరలు తేడాలు వస్తున్నాయి. ఎడ్ల, నాలుగు చక్రాల, తోపుడుబళ్ల కార్మికుల పొట్టగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం..వాణిజ్యశాఖ రాబడిని మాత్రం పక్కన పెట్టేసింది.
గతంలో ఇలా..
జిల్లాలోని బిడ్డింగ్ పాడుకున్న నిర్వహకుల నుంచి ఏడాదికి ఒకేసారి వాణిజ్య పన్నుల శాఖ ఐదు శాతం పన్ను వసూలు చేసేది. కొన్నిమార్లు రీచ్‌ల నిర్వహకులు తాము విక్రయించిన ఇసుక ధర మొత్తంలో ఐదు శాతం పన్ను చెల్లించేవారు. ఇప్పుడు ఇసుక రీచ్‌లు మహిళా సంఘాల చేతిలోకి వెళ్లిపోయాయి. పన్ను మాటే ఎత్తడం లేదు. సంఘాల సభ్యులు తమకేమీ తెలియదని మొండికేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖకు నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి బయటకు వెళ్లే ఇసుకపై పన్ను వసూలు కావాలి. దీంతో ఇసుక రవాణాపై ఏసీటీవో, డీసీటీవో, సీటీవో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తోంది. దాడులకు దిగుదామంటే ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాలంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించిన నాటినుంచి ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్లు వరకు ఇసుక విక్రయాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన వాణిజ్యశాఖకు కనీసం రూ.25 లక్షలు పన్ను రూపేణా రావాల్సి ఉండగా.. పైసా కూడా జమ కాలేదు.
అటెండరీ వ్యవస్థ లేకపోవడ మూ కారణమే
గతంలో వాణిజ్యపన్నుల శాఖ జరిపే ప్రతి లావాదేవీల్లోనూ అటెండరీ వ్యవస్థ ఉండేది. వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు నిత్యం ఈ శాఖ సిబ్బంది కన్నేసి ఉంచేవారు. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. వే బిల్లు, అసెస్‌మెంట్, పన్ను చెల్లింపు ఇలా అన్ని ప్రక్రియలూ వ్యాపారులు ఆన్‌లైన్‌లోనే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌ల్ని గుర్తించడమూ కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మహిళా సంఘాలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని అధికారులు చెబుతున్నారు. రీచ్‌ల్ని వేలం పాడుకున్న నిర్వహకులు గతంలో విధిగా పన్ను చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో శ్రీకాకుళం సర్కిల్ వాణిజ్యపన్నులశాఖ అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్లకు లేఖలు రాశారు. చెక్‌పోస్టుల్లోనూ నిఘా ఉండడం లేదని ప్రస్తావించారు.
అయితే ప్రభుత్వం ఇసుక జీవోపై వాణిజ్యశాఖ అంశం లేదని, జీవోలో స్పష్టత లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సమాధానం తెలిపారు. ఏపీ వ్యాట్ యాక్ట్ ప్రకారం ఇసుక విక్రయాలపై వే బిల్లులు కూడా మంజూరు చేయాలి. అప్పుడే ఆ లెక్కలకు చిక్కులుండవు. ఇన్‌వాయిస్, వే బిల్లు లేకపోతే ఆ వ్యాపార నిర్వహణ అసలు లెక్కలోకే రాదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇసుక విషయమై ఇచ్చిన జీవో కాపీని కూడా తమకివ్వాలని, దానిని జతచేస్తూ తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పినట్టు తెలిసింది. 0040 పద్దుకు డ్వాక్రా సంఘాలైనా ఐదు శాతం సొమ్ము చెల్లించేలా కృషి చేయాలని కోరింది. జిల్లా యంత్రాంగం ఇసుక అక్రమాల నిరోధానికి చెక్‌పోస్టులేర్పాటు చేయిస్తామని చెబుతున్నా అమల్లోకి రాకపోవడంపైనా సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
‘హుద్‌హద్’ ప్రభావం మరికొంత
అక్టోబర్ 12వ తేదీన సంభవించిన హుద్‌హుద్ తుపాను ప్రభావం కూడా వాణిజ్యపన్నులశాఖపై పడింది. తుపాను కారణంగా వ్యాపారులు సమయానికి పన్ను కట్టలేకపోయారు. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కట్టాల్సిన పన్ను మొత్తం నవంబర్ 30లోపు చెల్లించొచ్చునని గడువిచ్చింది. అయినా వ్యాపారులు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. నిత్యావసర ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతుండడంతో టర్నోవర్‌పై కట్టాల్సిన పన్ను మొత్తం కూడా పెరిగిపోవడం మరో కారణంగా చెబుతున్నారు. దీంతో శ్రీకాకుళం సర్కిల్‌లో సుమారు రూ.18 లక్షల బకాయి పెండింగ్‌లో ఉంది. ఒకవైపు ఇసుక రీచ్‌లనుంచి పన్ను లేకపోవడం, మరోవైపు తుపాను కారణంగా వ్యాపారులు పన్ను చెల్లించకపోవడంతో వాణిజ్యశాఖ ఆదాయం భారీగా తగ్గిపోయింది.