ఖాళీబిందెలతో రాస్తారోకో చేస్తున్న సర్వేయపాలెం గ్రామస్తులు
యర్రగొండపాలెం: తాగునీటి కోసం మండలంలోని సర్వేయపాలెం గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం సమీపంలోని జాతీయరహదారి వద్దకు వచ్చి రాస్తారోకో చేశారు. దాదాపు 3 గంటలపాటు రాకపోకలను స్తంభించి పోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రహదారిపైగా వెళ్తున్న 10వ తరగతి విద్యార్థులు, అత్యవసర వాహనాలను మాత్రమే వారు అనుమతించారు. బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాలను సైతం ఎటూ కదలనీయకుండా చేశారు. తమ గ్రామంలో 300 గడపలు ఉంటే ఒక్క బోరు మాత్రమే పనిచేస్తుందని, అందులో నుంచి వచ్చే అరకొరనీటి కోసం పనులు సైతం వదులుకొని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
4 సంవత్సరాల క్రితం సాగర్‌నీటి కోసం పైపులు వేసి వారం రోజులు నీళ్లు వదిలారని, ఆ తరువాత ఏకారణంతోనో నీటి విడుదల నిలిపి వేశారని తెలిపారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడంలేదని, అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ సమస్య విన్నవించుకున్నప్పటికీ ఫలితంలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్‌పైపులైన్ ఉంది కదా నీటిని ఎందుకు వదలడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నిలదీస్తే తమ గ్రామం సాగర్ నీటి విడదల జాబితాలో లేదని బదులిస్తున్నారని, కూలిపనులు పనులు మానుకొని గ్రామం అంతా రోడ్డుపైకి చేరాల్సిన గత్యంతరం ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పి.ఇజ్రాయిల్ తెలిపాడు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన చేస్తునే ఉంటామని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఎంపీడీఓ టి.హనుమంతరావు, సీఐ డి.మల్లికార్జునరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావులు అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో పైపులైన్‌వేసి సాగర్ నీటిని సరఫరా చేస్తామని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment