Woman protests
-
నారావారిపల్లెలో సీఎం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
-
ఏడేళ్లుగా ప్రేమ.. ఉద్యోగం రావడంతో మరో యువతితో..!
ఖమ్మం(కారేపల్లి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆయన ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష చేపట్టింది. కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన నూనావత్ పరోషన్ బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భూక్యా సురేష్, ఆమె ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయి తే ఇటీవల సురేష్‌కు రైల్వేలో ఉద్యోగం రావడంతో ఇంకో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసినా పరోషన్ తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన కుటుంబీకులతో సహా సురేష్ ఇంటి ఎదుట శుక్రవారం మౌనదీక్ష చేపట్టింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరోషన్ ఫిర్యాదు చేసింది. -
నీటి కోసం హైవేపై రాస్తారోకో
యర్రగొండపాలెం: తాగునీటి కోసం మండలంలోని సర్వేయపాలెం గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం సమీపంలోని జాతీయరహదారి వద్దకు వచ్చి రాస్తారోకో చేశారు. దాదాపు 3 గంటలపాటు రాకపోకలను స్తంభించి పోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రహదారిపైగా వెళ్తున్న 10వ తరగతి విద్యార్థులు, అత్యవసర వాహనాలను మాత్రమే వారు అనుమతించారు. బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాలను సైతం ఎటూ కదలనీయకుండా చేశారు. తమ గ్రామంలో 300 గడపలు ఉంటే ఒక్క బోరు మాత్రమే పనిచేస్తుందని, అందులో నుంచి వచ్చే అరకొరనీటి కోసం పనులు సైతం వదులుకొని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల క్రితం సాగర్‌నీటి కోసం పైపులు వేసి వారం రోజులు నీళ్లు వదిలారని, ఆ తరువాత ఏకారణంతోనో నీటి విడుదల నిలిపి వేశారని తెలిపారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడంలేదని, అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ సమస్య విన్నవించుకున్నప్పటికీ ఫలితంలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్పైపులైన్ ఉంది కదా నీటిని ఎందుకు వదలడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీస్తే తమ గ్రామం సాగర్ నీటి విడదల జాబితాలో లేదని బదులిస్తున్నారని, కూలిపనులు పనులు మానుకొని గ్రామం అంతా రోడ్డుపైకి చేరాల్సిన గత్యంతరం ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పి.ఇజ్రాయిల్ తెలిపాడు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన చేస్తునే ఉంటామని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఎంపీడీఓ టి.హనుమంతరావు, సీఐ డి.మల్లికార్జునరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావులు అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో పైపులైన్వేసి సాగర్ నీటిని సరఫరా చేస్తామని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
కూతురు పుట్టిందని గెంటేశారు
► ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవని భర్త ► అత్తింటి వద్ద ధర్నాకు దిగిన బాధిత మహిళ ► తనకు, కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ గాజువాక : కూతురు పుట్టిందనే కారణంతో భార్యను వదిలించుకున్నాడొక ప్రబుద్ధుడు. వివాహ సమయంలో రూ.5 లక్షల కట్నం, 15 తులాల బంగారం తీసుకొని ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు దిగాడు. దఫదఫాలుగా మరో రూ.1.40లక్షలను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కుమార్తె పుట్టిందని తన రక్త సంబంధీకులతో కలిసి కుమార్తెను, భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవకుండా తాత్సారం చేస్తున్నాడు. తన కుమార్తె పెద్దదవుతుండడంతో భవిష్యత్‌పై ఆందోళన చెందిన బాధితురాలు అత్తింటి వద్ద ఆదివారం ధర్నాకు దిగింది. తనను కాపురానికి పిలవాలని, ఆస్తిలో వాటా ఇచ్చి కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. స్థానిక నాయకులు, స్థానిక మహిళా సంఘం ప్రతినిధులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ సంఘటన వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన కృష్ణవేణికి కణితి కాలనీకి చెందిన రాడ్ బెండర్ సూరిశెట్టి సురేష్‌తో 2007 జూన్‌లో వివాహం చేశారు. పది రోజుల కాపురం తర్వాత అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త అప్పలనర్సమ్మ, ఆడపడుచు కలిసి కృష్ణవేణిని వేధించడం మొదలుపెట్టారు. కుమార్తె కాపురం కోసం ఆమె తల్లిదండ్రులు దఫదఫాలుగా అదనపు కట్నం చెల్లించారు. ఏడాది తర్వాత ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు ఆమెను చూడటానికి కూడా వెళ్లలేదు. పెద్దలు జోక్యంతో నెల రోజుల తర్వాత వెళ్లి పేరు (సాయి లిఖిత) పెట్టి వచ్చేశారు. ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఇక్కడికి తీసుకురావడం కోసం కూడా పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన నెల రోజుల తర్వాత పాపకు పుట్టిన రోజు వేడుకలు చేశారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఒక రోజు భర్త సురేష్ బాగా తాగి వచ్చి కృష్ణవేణిని చావబాదడంతో స్థానికులు ఆమెను గాజువాకలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న ఆమె ఇంటికి రావడం కోసం బయల్దేరగా అప్పటికే ఆమెను పంపేయాలని కుట్రతో ఉన్న అత్త కొద్దిరోజులు పుట్టింటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. అత్త, గ్రామ పెద్దల సూచన మేరకు పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణిని నేటికీ కాపురానికి పిలవ లేదు. ఆ తర్వాత రకరకాల గొడవలు చోటు చేసుకున్నాయి. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ వారిపై ఆమె గతంలో కేసు పెట్టింది. ప్రస్తుతం దానిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితిపై దిగులతో తన తల్లిదండ్రులు మంచం పట్టి మృతి చెందారని కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. తల్లిదండ్రుల మరణంతో సోదరులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో కుమార్తెను తీసుకొని బతుకుదెరువు కోసం ఆరు నెలల క్రితం గాజువాక వచ్చేసింది. కూలి పనులు చేసుకుంటూ శ్రామికనగర్లో నివశిస్తోంది. అయినప్పటికీ అత్తింటి నుంచి పిలుపు రాకపోవడంతో ఆదివారం స్థానిక పెద్దలతో కలిసి అత్తింటి వద్ద ధర్నాకు దిగింది. మెకు కణితి కాలనీలోని పెద్దలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు మారిశెట్టి గంగాభాయి, ఎం.పి.మల్లెపూలు మద్దతుగా నిలిచారు. ఆమె ధర్నాకు దిగడంతో భర్తతోపాటు అత్త, ఆడపడుచు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దువ్వాడ జోన్ పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ధర్నా విరమించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. తనకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోనని బాధితురాలు స్పష్టం చేయడంతో వారు వెనుదిరిగారు. -
మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నివాసాల మధ్య, మార్కెట్ సమీపంలో షాపు ఏర్పాటు చేయవద్దని టెంట్ వేసుకుని మహిళలు అక్కడే కూర్చోని నినాదాలు చేస్తున్నారు. కాగా, మద్యం షాపు ఏర్పాటుకు తమకు లైసైన్స్ ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి వద్దన్నాడు
కరీంనగర్ : తమకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని, రూ.10లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. వచ్చే నెల మే 2వ తేదీన వివాహం చేయడానికి పెళ్లి కుమార్తె తరపు వారు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. పెళ్లి కుమారుడు ఈ వివాహం తనకు ఇష్టం లేదని వర్తమానం పంపించాడు. ఇదేంటని అడిగితే.. ఇంకా కట్నం కావాలని అతడి కుటుంబసభ్యులు... పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి బైఠాయించింది. బాధితురాలు కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన అప్పాల రాజిరెడ్డి రెండో కూతురు బీటెక్ చదివింది. ఆమెకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన ఎ.సందీప్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. సందీప్ తన కుటుంబంతో కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో యూడీసీగా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం కావడంతో కట్నం కింద రూ.పది లక్షలు కావాలని డిమాండ్ చేయగా అందుకు అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. మార్చి 22న ఘనంగా ఎంగేజ్మెంట్ చేశారు. అదే రోజు వరకట్నం కింది రూ.5 లక్షలు, బంగారం కోసం మరో రూ.2లక్షల ముట్టచెప్పారు. మే 2న వివాహం జరిపించడానికి లగ్నపత్రిక రాసుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని సందీప్‌కుమార్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మధ్యవర్తుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు సమాచారం పంపించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి బంధువులను నిలదీయగా ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి తమకు ఇంకా కట్నం కావాలంటున్నారు. దీంతో అమ్మాయి, తల్లిదండ్రులు, బంధువులు మహిళా సంఘాల సహకారంతో బుధవారం సందీప్‌కుమార్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని ఠాణాకు తరలించారు.