నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి వద్దన్నాడు
కరీంనగర్ : తమకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని, రూ.10లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. వచ్చే నెల మే 2వ తేదీన వివాహం చేయడానికి పెళ్లి కుమార్తె తరపు వారు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. పెళ్లి కుమారుడు ఈ వివాహం తనకు ఇష్టం లేదని వర్తమానం పంపించాడు. ఇదేంటని అడిగితే.. ఇంకా కట్నం కావాలని అతడి కుటుంబసభ్యులు... పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారు.
దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి బైఠాయించింది. బాధితురాలు కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన అప్పాల రాజిరెడ్డి రెండో కూతురు బీటెక్ చదివింది. ఆమెకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన ఎ.సందీప్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. సందీప్ తన కుటుంబంతో కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో యూడీసీగా పని చేస్తున్నాడు.
ప్రభుత్వం ఉద్యోగం కావడంతో కట్నం కింద రూ.పది లక్షలు కావాలని డిమాండ్ చేయగా అందుకు అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. మార్చి 22న ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేశారు. అదే రోజు వరకట్నం కింది రూ.5 లక్షలు, బంగారం కోసం మరో రూ.2లక్షల ముట్టచెప్పారు. మే 2న వివాహం జరిపించడానికి లగ్నపత్రిక రాసుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని సందీప్‌కుమార్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మధ్యవర్తుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు సమాచారం పంపించాడు.
అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి బంధువులను నిలదీయగా ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి తమకు ఇంకా కట్నం కావాలంటున్నారు. దీంతో అమ్మాయి, తల్లిదండ్రులు, బంధువులు మహిళా సంఘాల సహకారంతో బుధవారం సందీప్‌కుమార్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని ఠాణాకు తరలించారు.