మద్యంపై గళమెత్తిన మహిళల నిర్బంధం
విజయవాడ సదస్సులో పోలీసుల హడావుడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యానికి వ్యతిరేకంగా మహిళాసంఘాలు సదస్సు నిర్వహించిన విజయవాడ హనుమాన్‌పేటలో హనుమంతరాయ గ్రంథాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం యుద్ధవాతావరణం కనిపించింది. పోలీసుల బూట్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతుండటంతో అంతా కంగారుపడ్డారు.
ప్రభుత్వ మద్యం వ్యాపారానికి వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సుకు సీపీఐ, సీపీఎం జాతీయ మహిళా నేతలు, స్థానిక మహిళా సంఘాల నాయకురాళ్లు పాల్గొన్నారు. ‘జనం ప్రాణాలు తీసే మద్యం పాలసీని మార్చాలి’ అనే అంశపై జరిగిన సదస్సు ముగింపు దశకు వస్తున్న సమయంలో ఆ ప్రాంతాన్ని వందమందికి పైగా పోలీసులు చుట్టుముట్టారు. తలుపులు మూసివేశారు సదస్సు ప్రాంతంలోనే కొద్దిసేపు నిర్బంధించారు. అప్రమత్తమైన మహిళా సంఘాల నాయకురాళ్లు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో వారికి కొద్దిదూరం ర్యాలీ చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ తమ గొంతు నొక్కాలని యత్నిస్తే ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అనంతరం ర్యాలీ జరిపారు.