బాబు ఎన్నికల హామీలు అమలుచేయాలి
మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక
విజయవాడ (గాంధీనగర్) : ప్రభుత్వ మద్యం పాలసీపై మహిళలు మండిపడ్డారు. దశలవారీగా మద్యం నియంత్రిస్తామని, బెల్టుషాపులు రద్దుచేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పాలసీ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యాన ‘ జనం ప్రాణాలు తీసే మద్యం పాలసీని మార్చాలి ’ అంశంపై శుక్రవారం సదస్సు జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ ఆదాయం కోసం నిస్సిగ్గుగా మద్యం అమ్మకాలు జరుపుతున్న సీఎం తీరుపై ధ్వజమెత్తారు. ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకరత్ మాట్లాడుతూ మద్యం కారణంగా గృహహింస పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో మంచినీటికంటే మద్యమే సులువుగా లభిస్తోందన్నారు. అధికార పార్టీ నాయకులే మద్యం మాఫియా అవతారమెత్తినట్లు సర్వేలో వెల్లడైందన్నారు.
కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టయితే సిగ్గుతో తలదించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.గంగాభవానీ మాట్లాడుతూ చంద్రబాబు ఒకవైపు మద్యం, మరోవైపు హెరిటేజ్ పాలు రెండింటి ద్వారా ఆదాయం పొందుతున్నారన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని మాట్లాడుతూ మద్యం నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. చైతన్య మహిళాసంఘం రాష్ట్ర నాయకురాలు రాధ మాట్లాడుతూ మద్యం కారణంగా కుటుంబాలు వీధినపడుతున్నాయన్నారు. అనంతరం గ్రంథాలయం నుంచి లెనిన్ సెంటర్ భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి, మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదస్సులో పి.లక్ష్మణరెడ్డి (మద్య నియంత్రణ కమిటీ ), కఠారి విజయలక్ష్మి (ఏఐపీడబ్ల్యుఏ), గాదె ఝాన్సీ (పీవోడబ్ల్యు), సూర్యారావు (డీవైఎఫ్‌ఐ), కె.ధనలక్ష్మి (శ్రామిక మహిళ), ఆంజనేయులు (పౌరహక్కుల సంఘం) మనోరమ (మహిళాసత్తా) పాల్గొన్నారు.
మద్యం పాలసీపై మహిళాగ్రహం
Published Sat, Jan 9 2016 1:35 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
Advertisement
Advertisement