రాష్ట్రంలో ఇంజినీరింగ్ బోధనలో నాణ్యత లోపిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. పలు కాలేజీల్లో అధ్యాపకులు కూడా లేని పరిస్థితి ఉంది. విద్యార్థులు పాఠాలను వల్లే వేస్తూ ముక్కుని పట్టుకుని పరీక్షలు రాసేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో విద్యార్హతగా పట్టాలే చేతుల్లో ఉంటాయి. చదివిన వారికి కొలువులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో శుక్ర, శనివారాల్లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సదస్సుల్లో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు, నిపుణులు ఇంజినీరింగ్ విద్యపై తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రయోగాత్మక అంశాలపై కొత్త ఆలోచనలు రేకెత్తించాల్సిన రేపటి ఇంజనీర్లను పుస్తకాల పురుగుల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలేజీ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా తీసుకుంటున్నాయని, సమాజానికి ఉపయోగపడే ఇంజినీర్లను రూపొదించలేక పోతున్నాయని ఆరోపిస్తున్నారు. గత ఏడేళ్లగా ఈ దుస్థితి నెలకొందని, దీన్ని ప్రభుత్వం స్పందించి సరిదిద్దాలని కోరుతున్నారు.
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వెనుకంజ
కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పలువురు విద్యార్థులు వెనకంజ వేస్తున్నారు. క్లాసులో సమర్థులు కూడా కంపెనీలు వేసే ప్రశ్నలకు సమాధాన చెప్పడంలో విఫలమవుతున్నారు. పట్టణాల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి కొంత బాగున్నా.. పల్లెల్లో వారైతే వెనకపడిపోతున్నారు.
కంపెనీ ప్రతినిధులకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. కంపెనీల ప్రతినిధులు కూడా విద్యాసంస్థ పల్లె లేక పట్టణంలో ఉందా అనేది చూసుకోకుండా ఏది నాణ్యమైన విద్యను అందించే మంచి విద్యాసంస్థ అనేది చూస్తున్నారు.
ఇక్కడ సిల్‌బస్ తేలిక...అక్కడ చిటికెలో నేర్చుకోచ్చు
మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ సిలబస్‌ను జేఎన్‌టీయూ రూపొందిస్తోంది. సబ్జెక్ట్ తేలిగ్గా ఉన్నా విద్యార్థులు నేర్చుకోవడం కష్టంగా ఉంది. మహారాష్ట్రలో నాగపూర్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఇంజినీరింగ్ శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటే అయినా వారు రూపొందించే సిలబస్ కష్టతరంగా ఉంటుంది. కాని సునాయాసంగా నేర్చుకోవచ్చునని అక్కడి నుంచి ఈ సదస్సులకు వచ్చిన అభ్యర్థులు చెబుతున్నారు.
యువ ఇంజినీర్లకు ప్రోత్సాహకాలెన్నో !
ఇంజినీరింగ్ విద్యార్థులను పరిశోధన దిశగా అడుగులు వేయించేందుకు ఇ.ఎస్.సి.ఐ సంస్థను ప్రభుత్వం స్థాపించింది. పరిశోధక గ్రూపులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ ఇస్తున్నాం. ఏడాదికి 80గ్రూపులకు ఆర్థికసాయం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, ఇంటర్నెట్ వాడకం, నూతన అంశాల ఆవిష్కరణ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఎంఎస్, పీహెచ్‌డీలు చేసేవారికి గైడ్‌లెన్స్ ఇస్తున్నాం. మొక్కుబడిగా చెబుతున్న ఇంజినీరింగ్ విద్యను మెరుగుపరచాల్సి ఉంది. వ్యాపారపరంగా కాలేజీల్ని కొన్ని యాజమాన్యాలు నిర్వహించడం దురదృష్టకరం.
- డాక్టర్ యు.చంద్రశేఖర్,
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డెరైక్టర్