ఆలస్యంగా మేల్కొన్న అధికారులు
జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు
కరువు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
బోరు బావుల చుట్టూ ఇంకుడు గుంతలు
నీటి సౌకర్యం ఉన్న చోట్ల మల్బరీ, గడ్డి పెంపకం
కుటుంబానికి రోజుకు రూ.500 కూలి లభించేలా పనులు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు
సాక్షి, చిత్తూరు:జిల్లా అధికార యంత్రాంగం ఆలస్యంగా మేల్కొంది. కరువు దెబ్బకు జిల్లావ్యాప్తంగా వేలాది మంది పొట్ట చేతపట్టుకుని బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వలసలు వెళ్తున్నా ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు ఇప్పుడు దృష్టి సారిం చారు. వలసలపై అధ్యయానికి కమిటీ వేశారు. వలసలు నిరోధించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కొక్క కుటుంబానికి రోజుకు రూ.500 కూలి లభించేలా చర్యలు చేపడుతున్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితి నెలకొంది. బోరు బావులు ఎండిపోయాయి. పంటల సాగు 50 శాతానికి పడిపోయింది.
సాగైన పంటలు సైతం నీళ్లు లేక ఎండిపోయాయి. ఉపాధి లేక జిల్లాలోని తంబళ్లపల్లె, కుప్పం, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, చిత్తూరుతో పాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది రైతులు, రైతు కూలీలు రోజూ బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. దీంతో వలసల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ఆలస్యంగా నడుం బిగించింది. వలసలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ ఏపీడీ గోపీచంద్ ఆధ్వర్యంలో ములకలచెరువు ఏపీడీ సాయిసుధీర్, వ్యవసాయశాఖ డీడీ యుగంధర్, పలమనేరు ఏడీ, ఇన్‌చార్జ్ డీపీఆర్వో మణిరామ్‌తో కూడిన బృందం గురువారం జిల్లా వాసులు అధికంగా వలసలు వెళ్తున్న బెంగళూరు ప్రాంతంలో పర్యటించింది. వలసలు వెళ్తున్న జిల్లా వాసులను సంప్రదించి వలసకు వెళ్లేందుకు దారి తీస్తున్న పరిస్థితులపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
దీంతో పాటు జిల్లావ్యాప్తంగా కరువు ప్రాంతాల్లో పర్యటించి వలస వెళ్తున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. వలస నివారణకు వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. అనంతరం ఈ కమిటీ జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ డ్వామా ఇన్‌చార్జ్ పీడీ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో వలసల నివారణకు డ్వామా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రైతుల పొలాల్లోనే వారికి పనులు కల్పించనున్నారు. పొలాలను చదును చేసుకోవడం, గట్ల వెంట టేకు, ఎర్రచందనం తదితర మొక్కలను పెంచాలని నిర్ణయించారు. రైతుల బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. ఇక అంతో ఇంతో నీటి సౌకర్యమున్న ప్రాంతాల్లో మల్బరీ, గడ్డి సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఫామ్‌ఫాండ్స్ సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులన్నింటినీ ఉపాధి హామీలో చేసేందుకు, తద్వారా ఒక్కొక్క కుటుంబానికి రోజుకు రూ.500 తగ్గకుండా కూలీ గిట్టుబాటు అయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మరో రెండు వారాల్లోపు పెద్ద ఎత్తున ఉపాధి పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు.
ఇప్పటివరకు జిల్లాలోని చిత్తూరు క్లస్టర్ పరిధిలో 6,294 మందికి, పుత్తూరు 9వేలు, నగరి 6వేలు, శ్రీకాళహస్తి 6వేలు, తిరుపతి 5,500, చంద్రగిరి 9వేలు, పుంగనూరు 7,500, పీలేరు 7వేలు, కుప్పం 10వేలు, తంబళ్లపల్లె 5వేలు, మదనపల్లె 6వేలు, పలమనేరు 6 వేల చొప్పున జిల్లావ్యాప్తంగా రోజూ 80వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఈ ఏడాది రూ.293 కోట్ల పనులు కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.209 కోట్ల పనులు కల్పించారు. వలసల నివారణలో భాగంగా ఉపాధి పనులను పెద్ద ఎత్తున పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది ముగిసే లోగా రూ.300 కోట్లకు తగ్గకుండా పనులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డ్వామా ఇన్‌చార్జ్ పీడీ వేణుగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వలసల నివారణే లక్ష్యమన్నారు.
వలసల నివారణకు కసరత్తు
Published Fri, Nov 6 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement