కూలీల దరిచేరని ఉపాధి | Workers are often employed | Sakshi
Sakshi News home page

కూలీల దరిచేరని ఉపాధి

Published Thu, Jan 2 2014 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Workers are often employed

=రూ.325 కోట్లకు ఖర్చు చేసింది రూ.160 కోట్లే
 =14.7 శాతం మంది కూలీలకు పనుల్లేవు
 =ఏపీవోలపై వేటుకు రంగం సిద్ధం

 
సాక్షి, చిత్తూరు: మండల స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూలీలకు ఉపాధి హామీ పనులు దరిచేరడం లేదు. ఉపాధి హామీ అమలులో రాష్ర్టస్థాయిలో చిత్తూరు జిల్లా ఒకప్పుడు ప్రథ మ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారు లు వేగంగా స్పందిస్తున్నా చాలాచోట్ల రాజ కీయ పలుకబడి కలిగిన ఏపీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కూలీలకు పనులు కరువవుతున్నాయి.

జిల్లాకు 2013- 14 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధిశాఖ రూ.325 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో జిల్లాలోని 66 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్ణయించిన వివిధ పనులతో కూలీలకు ఉపాధి కల్పించాల్సి ఉంది. డిసెంబర్ 31, 2013 నాటికి ఖర్చుచేసిన మొత్తం 160 కోట్ల రూపాయలే. కూలీల్లో 14.7 శాతం మందికి ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితి ఎక్కువగా మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో ఉంది. మామిడితోటల పెంపకం, ఇతర అభివృద్ధి పనులు గ్రామాల్లో 80 శాతం ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా జరగలేదు.
 
ఏపీవోలపై వేటుకు రంగం సిద్ధం
 
జిల్లా వ్యాప్తంగా అవినీతి ఆరోపణలతో తొలగించిన వా రు, అవకతవకలకు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైనవారు ఏపీవోలుగా చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కు వమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారు. మరికొందరు అధికార పార్టీ నేతల పలుకుబడితో సస్పెన్షన్ ఎత్తివేయించుకుని ఉద్యోగాల్లో ఉంటున్నారు. 23 మంది రోజువారి విధుల్లో సక్రమంగా వ్యవహరించడం లేదని జిల్లా డ్వామా పీడీ గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు వివరాలు పంపనున్నారు.
 
నిర్మల్‌భారత్ అభయాన్ అంతంతమాత్రమే
 
నిర్మల్‌భారత్ అభయాన్ కింద ఉపాధిహామీ పనుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లాకు 10 వేల యూనిట్లు మంజూరయ్యాయి. జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులు మరుగుదొడ్డి లేకపోతే దరఖాస్తు చేసుకుని పనులు చేసుకోవచ్చు. వీరికి ఉపాధి హామీ కింద నిధులు చెల్లిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నిర్మించిన యూనిట్లు 500 మాత్రమే. నిర్మల్ భారత్ అభయాన్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఉపాధిహామీ శాఖలు ఈ పనులు పర్యవేక్షించాలి. నాలుగుశాఖల అధికారుల మధ్య సమన్వయలోపంతో ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
 
తోటల పెంపకానికి కొత్త మార్గదర్శకాలు

 
ఎస్‌సీ, ఎస్‌టీ, చిన్న, సన్నకారు రైతులకు 2 ఎకరాల వరకు అర్హతగా మామిడి తోటల పెంపకానికి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎర్రవారిపాళెం, తంబళ్లపల్లె, ఇతర కొన్ని మండలాల్లో అనర్హులకు, పెద్ద భూస్వాములకు ఉపాధిహామీలో తోటల పెంపకానికి స్కీమ్‌లు ఇచ్చారు. దీనిపై విచారణ జరిపి కొందరు ఫీల్డ్‌స్టాఫ్‌ను సస్పెండ్ చేశారు.

ఈ క్రమంలో తోటల పెంపకానికి అర్హతలను నిర్ణయిస్తూ ఆర్‌వోసీ నం కే5/5868 కింద నిబంధనలు జారీ చేశారు. వీటి ప్రకారం ప్రతి రైతూ రెండు ఎకరాలకు లోబడి పండ్లతోటలు పెంచుకునేందుకు అర్హులు. లబ్ధిదారుడు కచ్చితంగా ఉపాధి జాబ్‌కార్డు హోల్డర్ అయి ఉండాలి. తహశీల్దారు నుంచి సన్నకారు రైతు అనే సర్టిఫికెట్ తీసుకురావాలి. మొక్కలు నాటదలచిన పొలానికి సంబంధించిన టెన్‌వన్ అడంగల్‌ను విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల కారణంగా ప్రాథమిక దశలోనే ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement