పరిహారం ఇవ్వకుంటే పనులు జరగనివ్వం
తోటపల్లి విస్తరణ పనులు అడ్డుకున్న రైతులు
ఒపించడానికి యత్నించిన తహశీల్దార్
ససేమిరా అన్న రైతులు
లావేరు.
తోటపల్లి కాలువల విస్తరణలో భూములు కోల్పోతున్నరైతులు తమకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు జరిపితే సహించేది లేదని తెగేసి చెప్పారు. పోలీసులతో పనులు జరిపించేందుకు యత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. తమకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదనీ, ఇప్పుడు భూములు అప్పగించేసి తరువాత అధికారుల చుట్టూ తిరగలేమని తేల్చిచెప్పారు. లావేరు సమీపంలో పొక్లెయిన్‌తో తోటపల్లి కాలువవిస్తరణ పనులు శుక్రవారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న లావేరు, లావేటిపాలేనికి చెందిన రైతులు నడుపూరి తౌడు, ఇజ్జుప్రసాద్, మహదాసు కుమార్, కోల రాజేష్, ఇసపకుర్తి సూర్యారావు, ఇనపుకుర్తి చిన్న, లంకలపల్లి భాస్కరరావు, ఇసపకుర్తి కూర్మారావు, లంకలపల్లిసత్తి మరి కొందరు అక్కడకు చేరుకుని పొక్లెయిన్‌ను నిలువరించి పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు అక్కడకు చేరుకుని రైతులను తప్పుకోమన్నారు. ఈ లోగా తహశీల్దార్ పి.వేణుగోపాలరావు కబురు పంపించి మధ్యాహ్నం చర్చలకు ఆహ్వానించారు.
రైతులు కార్యాలయానికి చేరుకుని తమ భూముల్లో పనులు అడ్డుకుంటే పోలీసులను పంపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తాము కాలులవలకు వ్యతిరేకం కాదనీ, తమభూములకు నష్టపరిహారం ఇస్తేనే సమ్మతిస్తామని తేల్చి చెప్పారు. అయితే పనులు పూర్తయ్యాక ఏమేరకు భూములు నష్టపోయిందీ లెక్కగట్టి ఆ మేరకు పరిహారం ఇస్తామని తహశీల్దార్, తోటపల్లి భూసేకరణ విభాగం డీటీ శ్రీహరి తెలపగా అందుకు వారు అంగీకరించలేదు. కాలువలు తవ్వకాలు చేపట్టక ముందు ఎకరాకు రూ. 17.50 లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారని ఇప్పుడు ఎకరాకు రూ. 15 లక్షలు ఇస్తామంటున్నారని అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఇంకేమి చెబుతారోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలకు తాము వ్యతిరేకం కాదని, నష్టపరిహారం ఇవ్వకుండా కాలువల తవ్వకాలు చేపట్టవద్దని రైతులు ఖరాఖండీగా చెప్పారు. అయితే చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అర్ధంతరంగా ముగించారు.
ఎలా నమ్మేది?
Published Sat, Jul 18 2015 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement