
ఎయిడ్స్ ఉందని వినగానే తెలిసిన వారే కాదు కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంచేవారు. ఆ వ్యక్తి చనిపోయినా మృతదేహాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ఎయిడ్స్ ఉందని తెలిసినా కలిసి జీవిస్తున్నారు. కుటుంబసభ్యులూ బాగా ఆదరిస్తున్నారు. సమాజంలో వారు ఒకరిగా జీవించేటట్లు చేస్తున్నారు. వ్యాధిపై పెరిగిన అవగాహనతో జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య తగ్గుతోంది. ఈ మార్పే ప్రమాదకర నిశ్శబ్దంపై విజయానికి సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో గత 2009 నుంచి ఇప్పటి వరకు 5,73,517 మంది సాధారణ ప్రజలకు పరీక్షలు నిర్వహించగా 17,405 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. అలాగే గర్భిణిల్లో 4,84,326 మందికి పరీక్షలు చేయగా 1,033 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. 2009లో సాధారణ ప్రజల్లో హెచ్‌ఐవీ బా«ధితుల సంఖ్య 6.15 శాతం ఉండగా, ప్రస్తుతం అది 1.50శాతంగా ఉంది. అలాగే గర్భిణుల్లో 2009లో 0.54శాతం నుంచి ప్రస్తుతం 0.09శాతానికి తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, పరీక్ష కేంద్రాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు పెరగడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఏఆర్‌టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య అక్టోబర్ వరకు 18,273 కాగా అక్కడ క్రమం తప్పకుండా మందులు వారే సంఖ్య 8,741గా ఉంది. ఏఆర్‌టీ ప్లస్ కేంద్రంలో 2వ రకం మందులు క్రమం తప్పకుండా వాడే వారి సంఖ్య 53గా ఉంది.
ఈసారి నినాదం నా ఆరోగ్యం– నా హక్కు
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డేను నిర్వహిస్తోంది. ఈ రోజున హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎదుర్కొనేందుకు అందరినీ దగ్గర చేసే ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సారి నినాదాన్ని ‘నా ఆరోగ్యం–నా హక్కు’గా పేర్కొంది.
హెచ్‌ఐవీతో జీవించే వారికి సంక్షేమ పథకాలు
రెవెన్యూ/సివిల్ సప్లయ్ శాఖ అన్నపూర్ణ రేషన్‌కార్డు ద్వారా 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.
ఎస్టీ కార్పొరేషన్‌లో 90 శాతం రాయితీతో రుణాలు
సెర్ప్/డీఆర్‌డీఏ ద్వారా పెన్షన్ నెలకు రూ.1000 చొప్పున 1318 మందికి ఇస్తున్నారు.
ఐసీడీఎస్ ద్వారా చిన్నపిల్లలకు డబుల్ న్యూట్రిషన్ అందిస్తున్నారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీ వారు 50 శాతం రాయితీతో బస్సు పాస్ సౌకర్యం కల్పించారు.
విద్యాశాఖ ద్వారా ఎస్‌ఎస్‌ఏ సహకారంతో కళాశాలల్లో రెడ్‌రిబ్బన్ క్లబ్ కార్యక్రమం అమలు.
డిసెంబర్ కార్యక్రమాలు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో డిసెంబర్ ఒకటిన ఉదయం 8 గంటలకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఆ తర్వాత హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణకు కృషి చేసిన వారికి సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో జ్ఞాపికలు, బహుమతులు ప్రదానం చేస్తాం. ఇదే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలను నిర్వహించనున్నాము. ఈ యేడాది టెస్ట్ ఆల్–ట్రీట్ ఆల్ న్యాకో మార్గదర్శకాల ప్రకారం సీడీ4 పరీక్షతో నిమిత్తం లేకుండా హెచ్‌ఐవీ పాజిటివ్ అని నిర్దారణ అయిన వెంటనే ఏఆర్‌టీ చికిత్స ప్రారంభిస్తున్నాము. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు జిల్లాలో కొత్తగా ఏడు రక్తనిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు, పరికరాలను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నాం. పెద్దాసుపత్రిలో యాంటి రిట్రోవైరల్ చికిత్స(ఏఆర్‌టి) కేంద్రాన్ని యాంటి రిట్రోవైరల్ చికిత్సా ప్లస్ కేంద్రంగా మార్చాము.
– డాక్టర్ దేవసాగర్, ఇన్‌చార్జ్ అడిషనల్ డీఎంహెచ్‌ఓ (ఎయిడ్స్ అండ్ లెప్రసి)
గర్భిణికి హెచ్‌ఐవీ ఉందని తేలితే
గర్భిణికి హెచ్‌ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్‌టీ సెంటర్‌కు పంపిస్తాము. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట్ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. కాన్పు ఆసుపత్రిలోనే జరిగేటట్లు జాగ్రత్త పడాలి. తల్లికి హెచ్‌ఐవీ ఉంది కాబట్టి అది బిడ్డకు రాకుండా ఉండేందుకు గతంలో సిజేరియన్ ప్రసవాన్నే వైద్యులు సూచించేవారు. ఇప్పుడు గర్భిణి ఏఆర్‌టీ మందులు వాడుతోంది కాబట్టి సాధారణ ప్రసవమూ మంచిదే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకు నివరిపిన్ అనే డ్రాప్స్ వేయాలి. రెండేళ్ల తర్వాత బిడ్డకు హెచ్‌ఐవీ లేదని నిర్దారణ అయితే అప్పుడు సాధారణ బిడ్డలా పెంచుకోవచ్చు. తల్లిపాల వల్ల బిడ్డకు ఇన్‌ఫెక్షన్లు రావు కనుక తాపవచ్చు.
– డాక్టర్ జ్యోతిర్మయి, గైనకాలజిస్టు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment