వేదికపై వీరమాచనేని, సీబీఐటీ కళాశాల చైర్మన్ జయచంద్రారెడ్డి తదితరులు.
ప్రొద్దుటూరు : మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని జయించడం సాధ్యమవుతుందని వీరమాచనేని రామకృష్ణారావు తెలిపారు. స్థానిక అనిబిసెంట్ ఎగ్జిబిషన్ మైదానంలో సీబీఐటీ చైర్మన్ వి.జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ డయాబెటిక్, బీపీ ఉన్నవారిని వైద్య రంగం శాశ్వతంగా వారిని రోగులుగా మార్చిందన్నారు.
వాస్తవానికి దగ్గు వస్తే ఎలా పోతుందో షుగర్, బీపీలు కూడా అలానే నియంత్రివచ్చన్నారు. డయాబెటిక్ రోగులు అనే పదం పచ్చి అబద్దమన్నారు. వానపామును అనకొండలా చూపి వారిని సర్వ నాశనం చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మందుల వాడకాన్ని క్రమేపి పెంచడం వల్ల వారు మరింత అనారోగ్యంపాలై కళ్లు పోగొట్టుకుంటున్నారన్నారు. కిడ్నీలు కూడా మందులు వాడకం వల్ల దెబ్బతింటున్నాయనేది వాస్తవమని తెలిపారు.
చివరికి డయాబెటిక్ రోగుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారన్నారు. తన ఆరోగ్య సూచనల వల్ల ఇన్సులిన్ వాడేవారు సైతం డయాబెటిక్ నుంచి బయట పడవచ్చన్నారు. అసలు వైద్య రంగంలో డయాబెటాలజి అనే విభాగమే లేదని తెలిపారు.
ఆహారంపై దృష్టి పెట్టాలి
మనిషి ప్రధానంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫాట్ ఉంటుందన్నారు. ఆధునిక జీవితంలో గుడ్డును తింటున్నా అందులోని పచ్చసోన తినడం లేదన్నారు. వాస్తవానికి పచ్చ సోనలోనే 80 శాతం ఫాట్ ఉంటుందన్నారు. 1977లో అమెరికా దేశం కొలస్ట్రాల్ వల్లే గుండెజబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారని తెలిపారు. అది అగ్రదేశం కావడంతో అందరూ ఆ విధానాన్ని పాటిస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
పాలిష్ బియ్యం వాడటం వల్ల అనారోగ్యానికి కారణమవుతున్నామని, ఆకలిని బట్టి ఆహారాన్ని తింటున్నామన్నారు. పూర్వం పొలం పనులు చేసుకుంటూ రైతులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినడాన్ని అలవాటు చేసుకున్నారని, ప్రస్తుతం శారీరక శ్రమ చేయకున్నా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు. అవసరం ఉన్నా లేకున్నా తింటుండటంతో ఊబకాయం, రోగాలు రావడం జరుగుతోందన్నారు.
రీఫైండ్ ఆయిల్ సంస్కృతి మంచిది కాదని తెలిపారు. సముద్ర ఉప్పును వినియోగించాలని కోరారు. తాను వెయ్యిమందిని డయాబెటిక్ రోగులను దత్తత తీసుకుని వ్యాధి నివారణ చేస్తానని, అందులో ఒక్కరికైనా డాక్టర్లు వ్యాధిని పోగొడుతారా అని ఆయన ప్రశ్నించారు. తాను అలా చేయలేని పక్షంలో జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు.
అనంతరం సీబీఐటీ కళాశాల చైర్మన్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు అనేక మంది సహకారం అందించారని తెలిపారు. కార్యక్రమంలో నెక్ ప్రతినిధి బాలస్వామి, రెడ్డి ఉపేంద్రబాబు, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు పాండురంగన్ రవి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ అల్పాహారంగా గుడ్డు, చికెన్ ముక్కలు, వాటర్ ప్యాకెట్లు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment