Rama krishna rao
-
తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీతో సంబంధం లేకుండా.. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి సీఎస్ నియామకం? పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. -
ఆరోగ్యంతోనే ప్రపంచాన్ని జయించవచ్చు
ప్రొద్దుటూరు : మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని జయించడం సాధ్యమవుతుందని వీరమాచనేని రామకృష్ణారావు తెలిపారు. స్థానిక అనిబిసెంట్ ఎగ్జిబిషన్ మైదానంలో సీబీఐటీ చైర్మన్ వి.జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ డయాబెటిక్, బీపీ ఉన్నవారిని వైద్య రంగం శాశ్వతంగా వారిని రోగులుగా మార్చిందన్నారు. వాస్తవానికి దగ్గు వస్తే ఎలా పోతుందో షుగర్, బీపీలు కూడా అలానే నియంత్రివచ్చన్నారు. డయాబెటిక్ రోగులు అనే పదం పచ్చి అబద్దమన్నారు. వానపామును అనకొండలా చూపి వారిని సర్వ నాశనం చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మందుల వాడకాన్ని క్రమేపి పెంచడం వల్ల వారు మరింత అనారోగ్యంపాలై కళ్లు పోగొట్టుకుంటున్నారన్నారు. కిడ్నీలు కూడా మందులు వాడకం వల్ల దెబ్బతింటున్నాయనేది వాస్తవమని తెలిపారు. చివరికి డయాబెటిక్ రోగుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారన్నారు. తన ఆరోగ్య సూచనల వల్ల ఇన్సులిన్ వాడేవారు సైతం డయాబెటిక్ నుంచి బయట పడవచ్చన్నారు. అసలు వైద్య రంగంలో డయాబెటాలజి అనే విభాగమే లేదని తెలిపారు. ఆహారంపై దృష్టి పెట్టాలి మనిషి ప్రధానంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫాట్ ఉంటుందన్నారు. ఆధునిక జీవితంలో గుడ్డును తింటున్నా అందులోని పచ్చసోన తినడం లేదన్నారు. వాస్తవానికి పచ్చ సోనలోనే 80 శాతం ఫాట్ ఉంటుందన్నారు. 1977లో అమెరికా దేశం కొలస్ట్రాల్ వల్లే గుండెజబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారని తెలిపారు. అది అగ్రదేశం కావడంతో అందరూ ఆ విధానాన్ని పాటిస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పాలిష్ బియ్యం వాడటం వల్ల అనారోగ్యానికి కారణమవుతున్నామని, ఆకలిని బట్టి ఆహారాన్ని తింటున్నామన్నారు. పూర్వం పొలం పనులు చేసుకుంటూ రైతులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినడాన్ని అలవాటు చేసుకున్నారని, ప్రస్తుతం శారీరక శ్రమ చేయకున్నా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు. అవసరం ఉన్నా లేకున్నా తింటుండటంతో ఊబకాయం, రోగాలు రావడం జరుగుతోందన్నారు. రీఫైండ్ ఆయిల్ సంస్కృతి మంచిది కాదని తెలిపారు. సముద్ర ఉప్పును వినియోగించాలని కోరారు. తాను వెయ్యిమందిని డయాబెటిక్ రోగులను దత్తత తీసుకుని వ్యాధి నివారణ చేస్తానని, అందులో ఒక్కరికైనా డాక్టర్లు వ్యాధిని పోగొడుతారా అని ఆయన ప్రశ్నించారు. తాను అలా చేయలేని పక్షంలో జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. అనంతరం సీబీఐటీ కళాశాల చైర్మన్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు అనేక మంది సహకారం అందించారని తెలిపారు. కార్యక్రమంలో నెక్ ప్రతినిధి బాలస్వామి, రెడ్డి ఉపేంద్రబాబు, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు పాండురంగన్ రవి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ అల్పాహారంగా గుడ్డు, చికెన్ ముక్కలు, వాటర్ ప్యాకెట్లు అందించారు. -
రాష్ట్ర ఉద్యోగులకు 2.096 శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 2.096 శాతం పెంచుతూ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 22.008 శాతం డీఏ అమల్లో ఉంది. పెరిగిన డీఏతో కలిపి 24.104 శాతానికి చేరుతోంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.400 కోట్ల భారం పడుతుందని అంచనా. ఈ నెల నుంచి నగదుగా.. సెప్టెంబర్æ నెల వేతనం నుంచి పెరిగిన డీఏను నగదుగా చెల్లిస్తారు. అంటే దసరా పండుగకు ముందే ఈ నెల 25న చెల్లించే జీతంతో పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఇక జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న బకాయిని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. బకాయిలకు సంబంధించి నవంబర్ 30లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లపై త్వరలో ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పెరి గిన డీఏ వర్తిస్తుంది. జిల్లా పరిషత్, మం డల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమి టీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యు లర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రం లోని వర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి, ఉద్యో గులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. అయితే పెన్షనర్లకు సంబంధించిన కరువు భృతి ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడు దల చేయనున్నట్లు సమాచారం. -
ట్రైబల్ గ్రూప్స్‌కు రూ. 3.02 కోట్లు
హైదరాబాద్: డెవలప్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సెంట్రల్ సెక్టార్ పథకంలో భాగంగా సాధారణ కార్యకలాపాలు, ఇతరత్రా వాటికి ఖర్చు చేసేందుకు రూ.3.02 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ పరిపాలనాపరమైన మంజూరునివ్వాలని గురువారం ఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. -
పెళ్లింట విషాదం
అప్పటిదాకా బంధువులు, కుటుంబసభ్యులతో కళకళలాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదం అలుముకుంది. కూతురుకు ఘనంగా వివాహం జరిపించి.. అత్తారింటికి పంపించిన ఆనందం నుంచి తేరుకోకుండానే ఆ కుటుంబసభ్యులను మృత్యువు కబళించింది. కూతురు వివాహ విందులో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఇసుక లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో బుధవారం వేకువజామున 2.15గంటలకు జరిగింది. మృతులంతా జిల్లావాసులు. గంభీరావుపేట/ ముస్తాబాద్, న్యూస్‌లైన్ : గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామానికి చెందిన కలకుంట్ల మమత, రాంకిషన్‌రావు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. రెండో కూతురు మానసకు ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా కామా రెడ్డిలో వివాహం జరిపించారు. మంగళవారం పెళ్లి కుమా రుడి ఇంట్లో విందు ఉండడంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు మమత(47), రాంకిషన్‌రావు, మేనమాన గౌరినేని ప్రభా కర్రావు(45), పెద్దమ్మ కుమారుడు అమృత్‌రావు(35), సమీప బంధువు ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామా నికి చెందిన చీటి వెంకటేశ్వర్రావు(30)తోపాటు మరికొం దరు కారులో హైదరాబాద్ వెళ్లారు. విందు ముగించుకొని అదేరాత్రి ఇంటికి తిరుగు పయనమయ్యారు. వేకువజామున 2.15 గంటల ప్రాంతంలో కామారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారి తూప్రాన్ మండలం నాగులపల్లి చౌరస్తా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నాగులపల్లిలో ఇసుకను నింపుకుని జాతీయ రహదారిపైకి వస్తున్న లారీని వీరి వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో పెళ్లికూతురు తల్లి మమత, మేనమామ ప్రభాకర్‌రావు, పెద్దమ్మ కుమారుడు అమృత్‌రావు, బంధువు వెంకటేశ్వర్రావు అక్కడికక్కడే మృతిచెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న తండ్రి రాంకిషన్‌రావు, బంధువులు నర్సింగారావు, శోభ, ప్రదీప్, రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గజ్వేల్ ఆస్పత్రికి, అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో శోభ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అప్పటివరకు పెళ్లి వేడుకలు.. బంధువుల సందడి.. ఇలా ఆ ఇంట్లో అందరితో పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లి చూసుకుని అందరూ ఇళ్లకు చేరుకున్నారో లేరో.. చావు కబురు అందగా.. బంధువుల రోదనలు మిన్నంటారుు. ప్రమాదంలో తల్లి, మేనమామ, పెద్దమ్మ కొడుకు చనిపోయాడన్న వార్త తెలుసుకొని నవ వధువు మానస తీవ్రంగా రోదించింది. ఆదర్శరైతు ప్రభాకర్‌రావు శ్రీగాధలో వ్యవసాయం చేసుకునే ప్రభాకర్‌రావు ఆదర్శరైతుగా సేవలందిస్తున్నాడు. గతంలో సింగిల్‌విండో డెరైక్టర్‌గా కూడా పనిచేశాడు. రైతులకు అందుబాటులో ఉంటూ అందరితో కలివిడిగా ఉండేవాడు. ప్రభాకర్‌రావుకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా.. కుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన వసంత, ప్రేంసాగర్‌రావులకు ఒక్కగానొక్క కుమారుడు చీటి వెంకటేశ్వర్రావు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఏడాది క్రితం ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు అర్ధంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా ఉంది. మరో మృతుడు అమృత్‌రావు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నిండింది. రెండు గ్రామాల్లో విషాదఛాయలు మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద జరిగిన ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదం నింపింది. శ్రీగాధ గ్రామానికి చెందిన మమత, ప్రభాకర్‌రావు, అమృత్‌రావు, గూడూరుకు చెందిన వెంకటేశ్వర్రావు మృతిచెందడంతో ఆయూ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం స్వగ్రామాల్లో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.