పెళ్లింట విషాదం | four people died in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Thu, May 15 2014 2:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

four people died in road accident

అప్పటిదాకా బంధువులు, కుటుంబసభ్యులతో కళకళలాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదం అలుముకుంది. కూతురుకు ఘనంగా వివాహం జరిపించి.. అత్తారింటికి పంపించిన ఆనందం నుంచి తేరుకోకుండానే ఆ కుటుంబసభ్యులను మృత్యువు కబళించింది. కూతురు వివాహ విందులో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఇసుక లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో బుధవారం వేకువజామున 2.15గంటలకు జరిగింది. మృతులంతా జిల్లావాసులు.                
 
 గంభీరావుపేట/ ముస్తాబాద్, న్యూస్‌లైన్ : గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామానికి చెందిన కలకుంట్ల మమత, రాంకిషన్‌రావు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. రెండో కూతురు మానసకు ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా కామా రెడ్డిలో వివాహం జరిపించారు.
 
 మంగళవారం పెళ్లి కుమా రుడి ఇంట్లో విందు ఉండడంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు మమత(47), రాంకిషన్‌రావు, మేనమాన గౌరినేని ప్రభా కర్‌రావు(45), పెద్దమ్మ కుమారుడు అమృత్‌రావు(35), సమీప బంధువు ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామా నికి చెందిన చీటి వెంకటేశ్వర్‌రావు(30)తోపాటు మరికొం దరు కారులో హైదరాబాద్ వెళ్లారు. విందు ముగించుకొని అదేరాత్రి ఇంటికి తిరుగు పయనమయ్యారు. వేకువజామున 2.15 గంటల ప్రాంతంలో కామారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారి తూప్రాన్ మండలం నాగులపల్లి చౌరస్తా వద్దకు చేరుకున్నారు.
 
 అదే సమయంలో నాగులపల్లిలో ఇసుకను నింపుకుని జాతీయ రహదారిపైకి వస్తున్న లారీని వీరి వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో పెళ్లికూతురు తల్లి మమత, మేనమామ ప్రభాకర్‌రావు, పెద్దమ్మ కుమారుడు అమృత్‌రావు, బంధువు వెంకటేశ్వర్‌రావు అక్కడికక్కడే మృతిచెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న తండ్రి రాంకిషన్‌రావు, బంధువులు నర్సింగారావు, శోభ, ప్రదీప్, రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గజ్వేల్ ఆస్పత్రికి, అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 
 వీరిలో శోభ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అప్పటివరకు పెళ్లి వేడుకలు.. బంధువుల సందడి.. ఇలా ఆ ఇంట్లో అందరితో పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లి చూసుకుని అందరూ ఇళ్లకు చేరుకున్నారో లేరో.. చావు కబురు అందగా.. బంధువుల రోదనలు మిన్నంటారుు. ప్రమాదంలో తల్లి, మేనమామ, పెద్దమ్మ కొడుకు చనిపోయాడన్న వార్త తెలుసుకొని నవ వధువు మానస తీవ్రంగా రోదించింది.
 ఆదర్శరైతు ప్రభాకర్‌రావు
 శ్రీగాధలో వ్యవసాయం చేసుకునే ప్రభాకర్‌రావు ఆదర్శరైతుగా సేవలందిస్తున్నాడు. గతంలో సింగిల్‌విండో డెరైక్టర్‌గా కూడా పనిచేశాడు. రైతులకు అందుబాటులో ఉంటూ అందరితో కలివిడిగా ఉండేవాడు. ప్రభాకర్‌రావుకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా.. కుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు.
 
 ఒక్కగానొక్క కుమారుడు
 ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన వసంత, ప్రేంసాగర్‌రావులకు ఒక్కగానొక్క కుమారుడు చీటి వెంకటేశ్వర్‌రావు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఏడాది క్రితం ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు అర్ధంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా ఉంది. మరో మృతుడు అమృత్‌రావు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నిండింది.
 
 రెండు గ్రామాల్లో విషాదఛాయలు
 మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద జరిగిన ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదం నింపింది. శ్రీగాధ గ్రామానికి చెందిన మమత, ప్రభాకర్‌రావు, అమృత్‌రావు, గూడూరుకు చెందిన వెంకటేశ్వర్‌రావు మృతిచెందడంతో ఆయూ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం స్వగ్రామాల్లో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement