అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని విద్యానిధి ఐఐటీ స్కూల్‌లో ఏర్పాటుచేసిన నమునా రాకెట్, శాటిలైట్లు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా నిర్వహించే అంతరిక్ష వారోత్సవాలకు ఈ సారి కోనసీమ కేంద్రంగా ఉన్న అమలాపురం విద్యానిధి ఐఐటీ టాలెంట్ స్కూల్ వేదిక కాబోతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో చేసిన ప్రయోగాలు, వాటి ప్రయోజనాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన పరిచేందుకు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, షార్, శ్రీహరికోట సంస్థల ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో అక్టోబర్ 4 నుండి పదో తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 12 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
వారోత్సవాలకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు ప్రత్యేక స్థానం కల్పించి అమలాపురంలో నిర్వహించడానికి షార్ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా అమలాపురంలో విద్యానిధి ఐఐటీ టాలెంట్ స్కూల్‌ని బుధవారం ఇస్రో శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అంతరిక్ష వారోత్సవాల కరపత్రాన్ని విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే వారోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే విద్యార్థులు, ప్రజలు తిలకించేందుకు విద్యానిధి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, రాత పరీక్షలు వక్తృత్వ పోటీలు, సైన్సు ఫేర్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష ప్రయోగాల చలన చిత్రాలను ప్రదర్శించనున్నట్టు శాస్త్రవేత్తల బృందం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోటీ పరీక్షల షెడ్యూల్ వివరాలు
6 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాత పరీక్ష
7 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు 1–5 తరగతుల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
8 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు వక్తృత్వ పోటీలు
9 వ తేదీ ఉదయం 10 గంటలకు సైన్సు ఫేర్ నిర్వహిస్తున్నారు.
పోటీ పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదిక వద్ద నమోదు చేసుకోవచ్చని విద్యానిధి చైర్మన్ నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment