Space Week celebrations
-
చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి? నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు? తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి? రాకెట్లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా! బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో! నేను రాకెట్లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!! ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. ఇస్రో స్పేస్ క్విజ్‌లో విజేతగా నిలిచింది. అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్ క్విజ్, వృక్తృత్వం, సైన్స్ ఫేర్లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ ఆస్టరాయిడ్ డే (జూన్ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది. అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్’ అంబాసిడర్స్ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య. ‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్సైక్లోపీడియా బుక్స్ తెచ్చింది. ఫోర్త్ క్లాస్ హాలిడేస్‌లో వాటిని చదివాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్ పెట్టాను. జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో! పోటీలే పాఠాలు! మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్సైట్లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్వేర్లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్లలో పాల్గొన్నాను. నా కెరీర్ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. డాన్స్‌కు ఇక దూరమే! నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్ డాన్స్ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్ పోర్ట్ ఫౌండేషన్ అంబాసిడర్ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య. అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు ఆస్టరాయిడ్ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్స్టర్ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్ఐఎఫ్ జీరో వన్ వన్...’ ఇలా ఒక టెంపరరీ నేమ్ ఇస్తాం. ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్ మీటింగ్‌లో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది. – గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
World Space Week: అంతరిక్షంలోనూ అమోఘం
సూళ్లూరుపేట: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో సైతం మహిళల పాత్ర అమోఘమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. చంద్రయాన్–2 వంటి ప్రయోగం ద్వారా భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చా రన్నారు. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రంలోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో రాణిస్తున్న మహిళా శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. భవిష్యత్‌లో గగన్‌యాన్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్న ఇస్రో.. అందులోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గగన్‌యాన్ ప్రయోగంలో వ్యోమగాములుగా మహిళలను పంపించే ప్రయత్నం చేయాలని కోరారు. -
రేపటి నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా నిర్వహించే అంతరిక్ష వారోత్సవాలకు ఈ సారి కోనసీమ కేంద్రంగా ఉన్న అమలాపురం విద్యానిధి ఐఐటీ టాలెంట్ స్కూల్ వేదిక కాబోతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో చేసిన ప్రయోగాలు, వాటి ప్రయోజనాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన పరిచేందుకు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, షార్, శ్రీహరికోట సంస్థల ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో అక్టోబర్ 4 నుండి పదో తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 12 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. వారోత్సవాలకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు ప్రత్యేక స్థానం కల్పించి అమలాపురంలో నిర్వహించడానికి షార్ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా అమలాపురంలో విద్యానిధి ఐఐటీ టాలెంట్ స్కూల్‌ని బుధవారం ఇస్రో శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అంతరిక్ష వారోత్సవాల కరపత్రాన్ని విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే వారోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే విద్యార్థులు, ప్రజలు తిలకించేందుకు విద్యానిధి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, రాత పరీక్షలు వక్తృత్వ పోటీలు, సైన్సు ఫేర్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష ప్రయోగాల చలన చిత్రాలను ప్రదర్శించనున్నట్టు శాస్త్రవేత్తల బృందం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల షెడ్యూల్ వివరాలు 6 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాత పరీక్ష 7 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు 1–5 తరగతుల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు 8 వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు వక్తృత్వ పోటీలు 9 వ తేదీ ఉదయం 10 గంటలకు సైన్సు ఫేర్ నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదిక వద్ద నమోదు చేసుకోవచ్చని విద్యానిధి చైర్మన్ నాయుడు తెలిపారు. -
ఇస్రో ఎదుగుదల దేశానికి గర్వకారణం
- కలెక్టర్ ముత్యాలరాజు సూళ్లూరుపేట: ఐదు దశాబ్దాల క్రితం ఉపగ్రహాలను తయారు చేసుకొని విదేశాలకు చెందిన రాకెట్ల ద్వారా పంపించే స్థాయి నుంచి విదేశీ ఉపగ్రహాలను మన రాకెట్ల ద్వారా ప్రయోగించే స్థాయికి ఇస్రో ఎదగడం దేశానికే గర్వకారణమని కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం డీఓఎస్ కాలనీ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు అంతరిక్ష నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సూళ్ల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేసి టీ షర్టులు ఇచ్చారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇస్రో ఈజ్ ది బెస్ట్ అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఇస్రో ప్రయోగించిన రాకెట్ నమూనాలు, ఉపగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో అమర్చి అంతరిక్ష నడకను చేపట్టారు. అనంతరం ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భారత శాస్త్రవేత్తలు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను 1995 నుంచి ఐఏఎస్ చదవాలని లక్ష్యంగా పెట్టుకొని చదివితే 2007 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పారు. అనంతరం షార్ డైరెక్టర్ మాట్లాడారు. 1957 అక్టోబర్ 4న మానవ నిర్మిత ఉపగ్రహం స్నుతిక్ను తయారు చేశారని, 1967 అక్టోబర్ 10న దీన్ని ప్రయోగించడంతో ఐక్యరాజ్య సమితి ఆమోదించి ప్రపంచ వారోత్సవాలుగా ప్రకటించడంతో కార్యక్రమాలను నిర్వస్తున్నామని చెప్పారు. వారం పాటు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థులకు ఆవగాహన కల్పించేందుకు రోహిణి – 2 సౌండింగ్ రాకెట్లను ప్రయోగించి చూపిస్తున్నామని చెప్పారు. మ్యూజియం, షార్ సందర్శనకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం అంతరిక్ష వారోత్సవాలపై వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. -
అవార్డు ఫంక్షన్ లేనట్టేనా?
నిర్వహించేలా లేరని చర్చించుకుంటున్న షార్ అధికారులు శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో ప్రతి ఏటా అక్టోబర్ 4 నుంచి 10 వరకు నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో ఈ ఏడాది జీఎస్ఎల్వీ అవార్డు పంక్షన్ నిర్వహించడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. సాధారణంగా 4న సూళ్లూరుపేట పట్టణంలో స్పేస్‌వాక్ కార్యక్రమం, షార్‌లోని అన్ని విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. అదే విధంగా అక్టోబర్ 8, 9 తేదీల్లో జీఎస్ఎల్వీ అవార్డు పంక్షన్ నిర్వహించేవారు. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్‌లో 2015–16 విద్యాసంవత్సరం పదో తరగతి జిల్లాస్థాయి ఉత్తీర్ణతలో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన వారిని జిల్లాకు ఇద్దరు చొప్పున షార్కు రప్పించేవారు. మెరిట్ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను ఆహ్వానించి రెండురోజులపాటు ఆతిథ్యం ఇచ్చి షార్ కేంద్రాన్ని చూపించేవారు. రెండో రోజున అంతరిక్ష విజ్ఞానంపై పోటీ పరీక్షలు నిర్వహించి అందులో ప్రథమస్థానంలో నిలిచిన వారికి జీఎస్ఎల్వీ అవార్డును బహూకరించేవారు. అయితే ఈ ఏడాది కూడా విద్యార్థుల జాబితాలను సేకరించారు కానీ ఎవరికీ సమాచారం పంపించలేదు. సాధారణంగా ఈ పాటికి అందరికీ ఆహ్వానాలు పంపించి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైళ్లకు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకోమని ఆదేశాలిచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆ ఊసే లేకపోవడంతో ఈ సారి జీఎస్ఎల్వీ అవార్డు పంక్షన్ నిర్వహించేలా లేరని షార్ అధికారులే ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. విముఖత ఎందుకో? ఈ సారి అంతరిక్ష వారోత్సవాలను మూడు రాష్ట్రాల్లోని సుమారు 17 ప్రాంతాలకు విస్తరించారే గాని ఆనవాయితీగా నిర్వహిస్తున్న జీఎస్ఎల్వీ అవార్డు పంక్షన్‌ను మాత్రం నిర్వహించేందుకు సుముఖంగా కనిపించడం లేదు. షార్ నుంచి చేస్తున్న ప్రతి ప్రయోగం విజయవంతం చేస్తున్నప్పటికీ ఆ ఫలితాలను ప్రజలతో పంచుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరమే అయినప్పటికి నిర్వహించేందుకు మాత్రం షార్ యాజమాన్యం ఎందుకు చొరవచూపడం లేదో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. -
భాష్యం బ్లూమ్స్ విద్యార్థినికి షార్ జీఎస్ఎల్వీ అవార్డు
గుంటూరు: శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ప్రపంచ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భాష్యం బ్లూమ్స్ స్కూల్ విద్యార్థిని జూలకంటి వెంకట లహరి జీఎస్ఎల్వీ అవార్డు అందుకున్నట్టు భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ భాష్యం గోపి తెలిపారు. మంగళవారం ఇక్కడి భాష్యం స్కూల్లో మంగళవారం లహరికి శాలువా కప్పి జ్ఞాపిక బహూకరించారు.