విశాఖ సిటీ : నీరు మన శరీరానికి మంచి ఔషధం. టానిక్‌లా పనిచేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే సంజీవిని నీరే. ఎక్కువగా తాగేవారు నిత్య యవ్వనంతో పాటు చర్మ సౌందర్యవంతులుగా ఉంటారు. ఆరోగ్య వంతులుగా జీవిస్తారు. చురుగ్గా పనిచేస్తారు. అందుకే నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
నీటితోనే ఆరోగ్యం
వేసవిలో వీలైనంత ఎక్కువ సార్లు నీరు తాగాలి. తగినంత స్థాయిలో పొట్టలో నీరు నిల్వ ఉండాలి. లేకపోతే సమస్యలు తలెత్తుతాయి. నీటితో ఆరోగ్యం సాధ్యం. చర్మం ప్రకాశవంతంగా సురక్షితంగా ఉంటుంది. సాధారణంగా మానవ శరీరంలో 70 నుంచి 75 శాతం నీరు ఉంటుంది. పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఆహారం లేకుండా 20 రోజులకుపైగా జీవించవచ్చు. నీరు లేకుండా రెండు రోజులు కూడా ఉండలేరు. శుద్ధి చేయని నీటిని తాగరాదు. కాచివడ పోసిన నీటినే తాగాలి. ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగకుండా ఇంట్లో కుండను ఏర్పాటు చేసుకుని అందులోని నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె జబ్బులు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారు, మందులు సేవించేవారు, కాలేయం వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నీరు తాగాలి.
నీరు తక్కువ తాగితే..
నీరు తక్కువ తాగితే డీ హైడ్రేషన్, మలబద్ధకం వచ్చేఅవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగడం, అలసట కలిగి నీరం వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి కలగడం, మూత్రవిసర్జన సక్రమంగా లేకపోవడం జరుగుతుంది. మూత్రం రక్త మలినాలతో నిండిపోతుంది. రక్తపోటు, శారీరక నొప్పులు, ఆస్తమా రావడానికి కారణం నీరు ఎక్కువగా తాగకపోవడమే. నీరు తక్కువగా తాగడం వల్ల లివర్ కోలెన్, యుటెరస్, ఊపిరితిత్తులువంటి అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. యూరిస్ జనిటెల్ వ్యాధులు రెక్టాల్ ప్రొల్యాప్స్, అజీర్ణం, ఫైల్స్ వంటి వ్యాధులువస్తాయి. శరీరంలో అత్యధిక కొలస్ట్రాల్ నిల్వ, గుండె సంబంధిత వ్యాధులు నీరు తాగకపోవడం వల్ల కలిగే ఫలితమే. చిన్న వయసు నుంచి నీరు తాగడం వల్ల అలవాటు తప్పితే పెద్ద అయిన తర్వాత దాహం తగ్గుతుంది. అందువల్ల కనీసం రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి.
శరీరమంతా జలమయమే
మన శరీరంలో రక్తంలో 80శాతం, మెడలో 74 శాతం, కండరాల్లో 75 శాతం, ఎముకల్లో 22 శాతం, కార్నియాలో 80 శాతం ఉంటుంది. మొత్తం కలిపి శరీరం బరువలో 2/3వ వంతు నీరు ఉంటుంది. శరీరంలో ఈ శాతాన్ని ఇలాగే ఉంచుకోవాలంటే నీరు తాగాల్సిందే. దీని వల్ల ఆరోగ్యంతో పాటు యవ్వనంగా ఉంటాం.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
నీరు ఎక్కువగా తాగడం వల్ల చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడులోని బూడిద రంగు పదార్థాల్లో 85 శాతం నీరు ఉంటుంది. అందువల్ల మెదడు సరిగా పనిచేయాలంటే తగినంత నీరు తాగాలి. మానసిక శక్తుల పెరుగుదలకు నీరు ఎంతగానో ఉపకరిస్తుంది. మెదడులో రెండు శాతం నీరు తక్కువైనా జ్ఞాపశక్తి తగ్గే అవకాశం ఉంది. శరీరంలో వివిధ అవయవాలు ఖనిజాలు సక్రమంగా పని చేయడానికి ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు, ఎంజైమ్స్ వంటివి చాలా అవసరం. రక్తంలో 83 శాతం వరకు నీరు ఉంటుంది.
నీటి దినోత్సవం వచ్చిందిలా..
నీటిని జాతీయ వనరుగా గుర్తించి.. పొదుపుగా వాడుకోవాలని జాతీయ జల విధానం చెబుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వృథాగా పోతున్న నీటిని రక్షించుకోవాలని, ప్రజలకు నీరు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వివిధ దేశాల్లో తాగునీరు కోసం ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎంతమందికి సమృద్ధిగా నీరు అందుతోందనే అంశాలను ప్రజలకు వివరించేందుకు 1992 మార్చి 22 నుంచి ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
తాగునీటి విషయంలో జాగ్రత్త అవసరం
శరీరంలో రక్త ప్రసరణ జరగాలంటే ఎక్కువ నీరు తాగాలి. ఇలా చేస్తే మూత్రాశయంలో రాళ్లు ఏర్పడవు. అదే విధంగా భోజనం చేయకముందు రెండు గ్లాసుల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఎండలో తిరిగే వారు క్రమం తప్పకుండా రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగితేనే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఇదే క్రమంలో కలుషిత నీరు తాగితే అనారోగ్యానికి గురవుతారు. ప్యాకెట్లలో శుద్ధి చేయని జలాలు నింపేసి అమ్ముతున్నారు. చాలా దుకాణాల్లో ప్యాకెట్లు ఎండలో ఉంటున్నాయి. వీటి వల్ల చాలా ప్రమాదం. ప్యాకెట్లలో నీటిని తాగడం వల్ల గొంతు నొప్పులు, జలుబు, దగ్గులాంటి సమస్యలతో పాటు టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. ఫుడ్‌గ్రేడ్ పాలిథీన్ ప్యాకెట్లు వినియోగించడం వల్ల కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి వేసవిలో ప్రజలు మంచినీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మేలు. చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాచి చల్లార్చిన నీరు తాగడం, ఫిల్టర్ చేసిన నీటిని తాగడం చాలా మంచిది. ఇంటిలో వినియోగించే బాటిల్స్ సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. – డా.కాండ్రేగుల వెంకట్‌రామ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment