విశ్వంలో జీవం ఆవిర్భవానికి.. మనిషి మనుగడకు.. అభివృద్ధికి నీరే మూలాధారం. నీరు లేకపోతే బతకలేం. అలాంటి నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తూ.. అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు చాలా మంది. ఓ వైపు జనాభా పెరుగుతుంటే.. మరోవైపు నీటి వనరులు తగ్గిపోతున్నాయి. వేసవి వస్తే చాలు దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. అందుకే నీటిని జాగ్రత్తగా వాడుకుని.. మన ముందు తరాలకు అందించాలి. అలా కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు వర్ణించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నేడు అంతర్జాతీయ నీటి దినోత్సవం. ఈ సందర్భంగా ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి బావి నుంచి నీటిని తోడటం కోసం తాడును లాగుతాడు. ఎంత సేపటికి తాడు మాత్రమే కనిపిస్తుంది కానీ నీటిని తీసుకు వచ్చే పాత్ర కనిపించదు. ఈ దృశ్యాన్ని చూసే వారికి అతడేదో పాతళంలో నుంచి నీటిని తోడుతున్నట్లుగా అనిపిస్తుంది. అలా జాగ్రత్తగా తోడిన నీటిని ఒంటెకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి సంచుల్లో నింపుకుంటాడు. నీటి ప్రాధాన్యాన్ని గుర్తించండి అంటూ సాగే ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఆ నీటి బావి కూడా ఎండిపోతే.. అప్పుడు ఏంటి పరిస్థితి అంటూ కొంత మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాప్ తిప్పగానే నీరు వచ్చే వారు ఈ వీడియోని చూసి ఓ పాఠం నేర్చుకోవాలి. నీటిని అనవసరంగా వృథా చేయకూడదు.. లేదంటే మనకు కూడా ఇదే గతి పడుతుంది అని గుర్తుంచుకోవాలి అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment