సాక్షి, నెల్లూరు : వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై ప్రజాభిప్రాయం కోరడం సాహసం. నెల్లూరు కలెక్టర్ శ్రీకాంత్ ఆ సాహసానికి పూనుకున్నారు. ‘మా అధికారుల పనితీరుపై తీర్పు చెప్పండి’ అని జన సభలు వేదికగా ఓటింగ్ కోరారు. ఇది రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం. కలెక్టర్ పిలుపుతో స్పందించిన జిల్లాలోని 937 పంచాయతీల ప్రజలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని తీర్పు చెప్పారు. ముఖ్యంగా కీలక శాఖలు, అధికారుల పనితీరు మరింత అధ్వానమన్నారు. వారి వల్ల ప్రజలకు నామమాత్రంగా కూడా మేలు జరగడం లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయం ద్వారా జిల్లా అధికారుల పనితీరును తాను తెలుసుకోవడంతో పాటు అధికారులకు కూడా తెలియచెప్పడం కలెక్టర్ ఉద్దేశంగా కనపడుతోంది.
సాక్షికి అందిన సమాచారం మేరకు..
జిల్లాలో అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామసభల్లో కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అధికారుల పనితీరుపై ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించారు. వివిధ శాఖల్లో అధికారుల పనితీరుపై నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 32 శాఖల్లో సగానికి పైగా అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. పనితీరు ఏ మాత్రం బాగాలేదని ఆయా గ్రామసభల్లో చేతులెత్తారు.
జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో జరిగిన 940 పంచాయతీలకు గాను 937 పంచాయతీల్లో జరిగిన గ్రామ సభల్లో ప్రజా ఓటింగ్ ద్వారా వెలువడిన వివరాల ప్రకారం 18 మంది తహశీల్దార్‌లను, 9 మంది ఎంపీడీఓలను, 26 మంది ఎస్‌ఐలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. మిగిలిన శాఖల్లో 50 శాతానికి పైగా అధికారులు సరిగా పనిచేయడం లేదని ప్రజలు తీర్మానించారు. మొత్తం 32 శాఖల్లో పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, అటవీశాఖ, తాగునీరు, రోడ్లు, గ్రామీణ విద్యుద్దీకరణ, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ,భూమి, అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, చిన్నతరహా పరిశ్రమలు, వయోజన విద్య, గ్రంథాలయాలు, బలహీన వర్గాల సంక్షేమం, గ్రామీణ పంచాయతీలు తదితర శాఖల పనితీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. కాగా విద్యాశాఖపై ప్రజలు స్పందించక పోవడం గమనార్హం.
రెవెన్యూ, రక్షణ శాఖలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రామ సభల్లో అధికారులను నిలదీసిన సందర్భాలు, గ్రామ సభలకు హాజరు కాకుండా అడ్డుకున్న సందర్భాలు ఈ గణాంకాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 500 మందికి పైగా అవార్డులను (ప్రశంసా పత్రాలు) అందచేయడం హాస్యాస్పదమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పైరవీలకే ప్రశంసలు
తమ ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు, సిబ్బంది మాత్రమే అవార్డులు పొందుతున్నారు. మెరుగైన పనితీరు ప్రదర్శించి ఆదర్శ ప్రాయంగా అవార్డులు అందుకునేవారు అరుదని చెప్పక తప్పదు. గతంలో ప్రశంసా పత్రాలు అందుకున్న ఉన్నతాధికారులు అవినీతిలో ఇరుక్కు పోయిన సందర్భాలు అనేకం. అవినీతిలో కూరుకుపోయిన అటవీశాఖాధికారులు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విద్యాశాఖాధికారి, డీఎంఅండ్ హెచ్‌ఓ, గత మున్సిపల్ కమిషనర్ ఇలాంటి ప్రశంసా పత్రాలు అందుకున్నవారే. ఏ ప్రాతిపదికన ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసలను అందచేస్తున్నారో అర్థం కాక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అధికార యంత్రాంగం అధ్వానం
Published Sun, Jan 26 2014 3:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement