అధ్వానంగా నగర కార్పొరేషన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరు నగర కార్పొరేషన్ పరిస్థితి అధ్వానంగా తయారవుతోందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక 17వ డివిజన్‌లోని శ్రామికనగర్, అపోలో హాస్పిటల్ సెంటర్, మధురానగర్‌లలో ఆదివారం ఆయన పర్యటించారు. అపోలో హాస్పిటల్ సెంటర్ వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయాల్లో బయట తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, దోమల సమస్య విపరీతంగా ఉన్నట్టు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న డీఈ, శానిటేషన్ అధికారులను ఆదేశించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతంలో కనీసం వీధిలైట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ముందు వీధిలైట్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు అవి కాకుండా మిగతా సమస్యలు చెప్పుకునేలా చేయండని కోరుతున్నానన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నగర కార్పొరేషన్‌పై దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరా రు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు మాధవ్, కె.సతీష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాము, మనోహర్, సీపీఎం స్థానిక సభ్యుడు ఎస్‌కే నజీర్, బి.ప్రసాద్, చాన్‌బాషా, పవన్, తిరుపతి, పట్రంగి అజయ్, హైమావతి, మహాలక్ష్మమ్మ, నాగేశ్వరరావు, సాంబయ్య, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.