వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్ధితి మరింత దయనీయంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర పరిస్ధితులను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళుతుంటే చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పేరిట ఏకంగా 90 టీఎంసీల కృష్ణాజలాలను అటు రాయలసీమ, ఇటు నాగార్జున సాగర్ ఆయుకట్టను ఎండగట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు.
ప్రాజెక్టు కట్టడాన్ని అడ్డుకుంటే తెలంగాణలో మీ ఓట్లు పోతాయని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటి తోడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే అదీ అక్రమమని చెప్పలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇష్టానుసారంగా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెంచి రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే కర్ణాటక నుంచి కిందకు రావాల్సిన జలాలు రావడం లేదని, దీని వలన ైరె తులు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముష్టి వేసిన విధంగా రూ.50 మద్దతు ధర కల్పించడం రైతులను అపహాస్యం చేయడమేన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో ఎంతటి పోరాటాలకైనా వెనుకాడమని హెచ్చరించారు.
బాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయం
Published Fri, Jun 19 2015 12:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement