టీడీపీలో ఉన్నది మోసగాళ్లు
పట్నంబజారు: తెలుగుదేశం పార్టీలో ఉన్న మోసగాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అవినీతి ముఖ్యమంత్రి పోటీలు నిర్వహిస్తే చంద్రబాబునాయుడుకు ప్రథమ స్థానం దక్కుతుందన్నా రు. 420కి ఉదాహరణగా చంద్రబాబుని తీసుకునే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి, అమలు చేయాలని నిలదీస్తున్న ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల కమిషన్‌కు సైతం చెప్పిన చంద్రబాబు, ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత పరిమితి ప్రకారం చేస్తామని చెప్పటం ఎంతవరకు సబబన్నారు.
పూర్తి స్థాయిలో రుణాలన్నీ రద్దు చేస్తామని ఫ్లెక్సీలు, కరపత్రాల్లో ఊదరగొట్టిన టిడిపి నేతలు, అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు రూ.1.50లక్షలు పంట రుణం, రూ 50 వేలు బంగారం, డ్వాక్రా రుణాలు రూ .లక్ష మా త్రమే రద్దు చేస్తామని చెప్పటం వంచన కాదా అని ప్రశ్నించారు. రద్దు చేస్తామని చెప్పిన వాటిని సైతం ఇప్పటి వరకు బ్యాంకుల్లో చెల్లించకపోటంతో రైతులు, డ్వాక్రా మహిళలు అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం రుణమాఫీపై చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ వాగ్దానానికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఒక మాట, ఆ తరువాత మరో మాట చెప్పి ఊసరవెల్లి పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ జైలులో ఉండాలని వ్యాఖ్యలు చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మరోసారి టీడీపీ నేతలు జగన్‌పై కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందన్నారు. జగన్ ఎక్కడ ఉండాలో ప్రజలు, కోర్టు నిర్ణయిస్తారని, టీడీపీ నేతలు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు కోసం నిలదీయాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్‌మాబు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.