- రోడ్డుపై బైఠాయించిన వైనం
- ఓ వర్గానికి సహకరిస్తున్నారనే విమర్శలు
పాకాల : వేరుశెనగ విత్తనాల పంపిణీలో అధికారుల జాప్యంపై ఆగ్రహించిన వందలాది మంది రైతులు పాకాలలోని మార్కెట్ యార్డు కార్యాలయం ముందు రోడ్డుపై శనివారం సాయంత్రం బైఠాయించి ధర్నాకు దిగారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకపోగా, అలస్యంగా వచ్చిన విత్తనాలను సైతం ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు.
విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పాకాల సింగిల్ విండో అధ్యక్షుడు ఎన్.మునీశ్వర రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.. విత్తన పంపిణీ విషయం తెలుసుకున్న మండలంలోని వందలాది మంది రైతులు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే మార్కెట్ యార్డు అవరణకు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఒంటిగంట ప్రాంతంలో భోజనానికి వెళ్లిన అధికారులు సాయంత్రం అవుతున్నా రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు.
ఒక్కరోజు కూడా గడవకనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాకాల-తిరుపతి రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి హరిత, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాకాల పోలీసులు, సింగిల్ విండో కార్యదర్శి మురళి జోక్యం చేసుకుని రైతులకు నచ్చచెప్పి ఎంత సమయమైనా విత్తనాలు అందరికీ అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఓ వర్గానికే సహకరిస్తున్నారు..
అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. అందుకోసమే ఓ లోడ్ విత్తనాలను సింగిల్ విండో కార్యాలయం వద్ద దించుకుని వారి అనుచరులకు పంపిణీ చేస్తున్నారని మిగిలిన వారిని మార్కెట్ యార్డు వద్దకు రమ్మని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను సైతం నిల దీశారు. అలాంటిదేమీ లేదని, అందరికీ విత్తనాలు పంపిణీ చే స్తున్నామని అధికారులు తెలిపారు.