
వాన వస్తే కారుతోంది..
♦ నీటిని ఎత్తివేసేందుకు అవస్థపడుతున్నాం..
♦ భోజనం సరిగా లేదు
♦ మంత్రి వద్ద వాపోయిన హాస్టల్ విద్యార్థినులు
♦ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం
అనంతపురం అర్బన్ : ‘భోజనం బాగుండడం లేదు.. వాన వస్తే హాస్టల్ కారుతోంది, ఆ నీటిని ఎత్తివేసేందుకు అవస్థలు పడుతున్నాం.. భవనంలో 300 మంది ఉంటున్నాం.. టాయ్‌లెట్లు లేవు..’ అని స్థానిక అరవిందనగర్‌లోని ఎస్‌సీ బాలిక హాస్టల్-2 విద్యార్థినులు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత వద్ద వాపోయారు. మంత్రి ఆదివారం హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తమ సమస్యలను ఆమెకు వివరించారు. హాస్టల్ నిర్వహణ సరిగ్గాలేకపోవడంపై ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటారు. వారిని మీ సొంత పిల్లల్లా చూసుకోవాలి.
వారిని ఇబ్బంది పెడుతున్నట్లు నా దృష్టికి వస్తే చర్చలు తప్పవు’ అని అన్నారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూసుకుంటారా..? వీళ్లు అమ్మనాన్నలను వదిలేసి ఇక్కడి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్లను మీ పిల్లల్లా చూసుకోవాల్సింది పోయి పట్టించుకోరా..? భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదంట. ఇలాగైతే మీ అందరిపైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంత మంది పిల్లలకు ఈ చిన్న భవనం సరిపోదు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వేరొక మంచి భవనంలో మార్పించే ఏర్పాటు చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు.